
- సిద్దిపేట జిల్లా తిగుల్, నిర్మల్ నగర్, బస్వాపూర్‌లో రాస్తారోకోలు
- సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
జగదేవపూర్, వెలుగు: దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా చేశారని సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిగుల్, బస్వాపూర్, నిర్మల్ నగర్ గ్రామాలకు చెందిన దళిత మహిళలు, యువకులు ఆదివారం గంటకుపైగా ధర్నా, రాస్తారోకో చేశా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తిగుల్ గ్రామంలో దాదాపు 400 దళిత కుటుంబాలు ఉండగా 20 యూనిట్లు మాత్రమే శాంక్షన్ అయ్యాయన్నారు. అర్హులు ఎక్కువున్న చోట.. యూనిట్ల కేటాయింపు తక్కువగా ఉందని వాపోయారు. వచ్చిన యూని ట్లను ఎవరికీ ఇవ్వాలో తెలియక బీఆర్ఎస్ లీడర్లు గ్రామంలోని పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది పేర్లతో లిస్టు తయారుచేసి పైఆఫీసర్లకు పంపించారన్నారు. సదరు లిస్టును కొంతమంది సోషల్ మీడియాలో శనివారం వైరల్ చేయడంతో అందు లో లేని అర్హులైన పేద దళిత కుటుంబాలు సర్పంచ్ భాను ప్రకాశ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా దళిత కుటుంబాల మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే నిర్మల్ నగర్ గ్రామంలో చేసిన ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రమోహన్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు. బస్వాపుర్ లో 60 కుటుంబాలు ఉండగా 5 యూనిట్లు మాత్రమే శాంక్షన్ అయ్యాయి. ఓ చైర్మన్ తన అనుచరులకు మాత్రమే ఇప్పించుకున్నారని మహిళలు, యువకులు పెద్ద ఎత్తున గ్రామపంచాయతీ ఆఫీస్ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. గ్రామ యువకులు రాజు, నర్సింలు, రమేశ్, కరుణాకర్, వెంకటేశ్, సంతోష్, కుమార్, అనిల్, సత్య లక్ష్మి, మల్లమ్మ, చంద్రవ్వ, బాలమణి పాల్గొన్నారు.