- ఇంద్రవెల్లిలో టెన్షన్!
- నేడు దళిత గిరిజన దండోరా
- లక్ష మంది జన సమీకరణకు కాంగ్రెస్ నేతల కసరత్తు
- సభాస్థలి వద్ద భారీ ఏర్పాట్లు
- అడ్డుకుంటామంటున్న ఆదివాసీ సంఘాలు
ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా చేపట్టడం, కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు ప్రకటించడంతో ఆదిలాబాద్జిల్లా ఇంద్రవెల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంద్రవెల్లిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం తలపెట్టిన దళిత గరిజన దండోరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి 200 మంది కాంగ్రెస్ముఖ్య లీడర్లతోపాటు లక్షమందికి తక్కువ కాకుండా జనాలను తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్లాన్చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పజెప్పారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుండగా 12 గంటలకు రేవంత్‌రెడ్డి హాజరవుతారు.
లక్ష మందికి తగ్గకుండా..
సభకు జనాలను తీసుకొచ్చే పూర్తి బాధ్యతను స్థానిక నేతలు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, బేల, జైనథ్ మండలాల నుంచి జనాలను తరలించే బాధ్యతను ఏఐసీసీ మెంబర్ గండ్రత్‌సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్ తీసుకున్నారు. పదివేలకు పైగా జనాలను ఆటోలు, జీపులు తదితర వాహనాల్లో తరలించే ఏర్పాట్లు పూర్తి చేశారు. బోథ్నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలించేందుకు తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, నాయకులు డాక్టర్ అన్నెల అశోక్బాధ్యతలు తీసుకున్నారు. నిర్మల్, ముథోల్ప్రాంతాలకు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఖానాపూర్ ప్రాంతానికి భారత్చౌహాన్ బాధ్యత తీసుకుని 15 వేల మందిని తీసుకొచ్చేలా ప్లాన్చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా నుంచి 15 వేల మందిని తీసుకొచ్చేందుకు విశ్వప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాలనుంచి జనాలను తీసుకొచ్చే బాధ్యత ప్రేంసాగర్ రావ్ తీసుకున్నారు. అన్ని మండల, గ్రామస్థాయిలో జనాలను తీసుకొచ్చే బాధ్యతలను ఆయా నేతలకు అప్పజెప్పారు.
అడ్డుకునేందుకు ఆదివాసీల ప్లాన్
ఇంద్రవెల్లి సభను అడ్డుకునేందకు ఆదివాసీ సంఘాలు ప్లాన్చేస్తున్నాయి. సభకు వచ్చే ముఖ్య నేతలను మధ్యలోనే అడ్డుకోవాలని భావిస్తున్నారు. 1976లో ఎస్టీ జాబితాలో లంబాడాలను చేర్చిన కాంగ్రెస్ఇపుడు మళ్లీ తమపై విద్రోహ చర్యకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. లంబాడాలు, గోండులు కలిసి ఉద్యమాలు చేశారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఇంద్రవెల్లిలో వైభవంగా జరుపుతామని, ఈ సంవత్సరం అదేరోజు రాజకీయ పార్టీ సభ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సభను ఎట్టి పరిస్థితుల్లో నడవనీయమని సంఘం నేతలు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గొడవలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో సభ జరగనీయం
నేటి ఇంద్రవెల్లి సభను ఎట్టి పరిస్థితిలో జరగనీయం. గోండులు, లంబాడాలు కలిసి పో రాటాలు చేశారని చెప్పిన రేవంత్‌రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ఆదివాసీల ఉద్యమాలకు లంబాడాలు ఎప్పుడూ సహకరిం చలేదు. పైగా మమ్మల్ని పాతాళానికి తొక్కారు. వారిని ఎస్టీ జాబితాలో కలిపిన కాంగ్రెస్‌పార్టీ ఇపుడు మాయమాటలు చెబుతోంది.
- గొడం గణేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు