స్వరాష్ట్రంలో దగాపడ్డ దళితులు

తెలంగాణలో దళితుల పట్ల కేసీఆర్​సర్కారు పాటించిన ద్వంద్వ ప్రమాణాలకు లెక్కేలేదు. పదవుల నుంచి భూముల దాకా అదే వ్యవహారం. ఎస్సీ కార్పొరేషన్​ఉన్న మాటే కానీ, దళితుల స్వయం ఉపాధి దక్కింది లేదు. వారికి దక్కాల్సిన చట్టబద్ధమైన నిధులను సైతం ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించడం చూస్తే ఎనిమిదేండ్లలో దళితులు ఎంత నష్టపోయారో అర్థమవుతుంది. ఏటా ఎస్సీ సబ్​ప్లాన్ కు కేటాయిస్తున్న నిధులు సుమారు రూ.15 వేల కోట్లు. అంటే ఎనిమిదేండ్లకు లక్షా 20 వేల కోట్ల రూపాయలు అవుతాయి. మరి వాటిలో ఎంత ఖర్చు చేశారు? ఎన్ని నిధులను దారి మళ్లించారనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించరాదని, వ్యయాన్ని కచ్చితంగా ఆడిట్​చేయాలనే  నిబంధనలతో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్​ యాక్ట్​‌‌–2013 తెచ్చారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్​ ప్రభుత్వం 2017లో ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్​ పేరును తొలగించి, ఎస్సీ, ఎస్టీ డెవలప్​మెంట్​ యాక్ట్ ​–2017 తీసుకు వచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలను ఆసరా చేసుకొని నిధులను దారి మళ్లించడం మొదలుపెట్టింది. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధిలోని సెక్షన్(3)డీలో చెప్పిన మౌలిక వసతుల అభివృద్ధికి 7 శాతం వాడుకోవచ్చన్న క్లాజును అడ్డం పెట్టుకొని నిధుల మళ్లింపు జరుగుతున్నది. నిధులను దారి మళ్లించడానికి అవకాశం కల్పిస్తున్న సెక్షన్(3)11డీని వెంటనే రద్దు చేయాలి. దళితులకు కేటాయించిన బడ్జెట్​నిధులను  స్వతంత్ర నోడల్​ ఎజెన్సీ ద్వారా ఖర్చు చేయాలి. ఖర్చు కాని నిధులను ఆ తర్వాతి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్​ చేయాలి. కానీ  కేసీఆర్​ సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు
2018‌‌‌‌–19 నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు​లోన్లు ఇవ్వడం నిలిపివేశారు.  ఏడేండ్లలో స్వయం ఉపాధి కోసం 9 లక్షల15 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, కేవలం లక్షా 5 వేల మందికే రుణాలు వచ్చాయి. 2019–21 వరకు ఎలాంటి యాక్షన్​ ప్లాన్​రూపొందించకుండా లక్షలాది దళితుల నోట్లో సర్కారు మట్టికొట్టింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని 2014లో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టిన సర్కారు.. 6 ఏండ్లలో కేవలం రూ. 670 కోట్లు ఖర్చు చేసి 6051 కుటుంబాలకే భూమి ఇచ్చింది. సీఎం కేసీఆర్​ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ..‘మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు’ అని జంకు లేకుండా చెప్పేశారు. ప్రభుత్వం ఈ పథకంపై చేతులెత్తేసిందని చెబితే కొంత నిజాయతీ అయినా మిగిలేది. రాష్ట్రంలో17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వమే చెబుతున్నది. అందులో గుంట భూమి కూడా లేనివారు సగానికి పైనే ఉంటారు. 

దళితబంధు అందేదెన్నటికి?
దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని అటకెక్కించిన సర్కారు.. హుజూరాబాద్​ఓట్ల ముందు దళిత బంధు పథకం తెచ్చింది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని, దాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో18 లక్షల కుటుంబాలకు ఇవ్వాల్సిన పథకం అది. మొదట హుజూరాబాద్​ నియోజకర్గానికి పరిమితం చేసింది. తర్వాత ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఒకరికి ఇవ్వనున్నట్లు తెలిపింది. అక్కడక్కడా దళితు బంధు ఇస్తున్నా.. లబ్ధిదారులు మొత్తం అధికార పార్టీ నేతలు, వారి బంధువులు, వారి బినామీలే ఉంటున్నారు తప్ప సామాన్య దళితుడికి ఆ పథకం అందుతున్న జాడ లేదు. దళితుల పథకాలు, సబ్సిడీలు, సబ్​ప్లాన్​ నిధులు, స్వయం ఉపాధి నిధులు అన్నిటికీ ఎగనామం పెట్టి, పది లక్షల దళిత బంధు పేరుతో కేసీఆర్​రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు రావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో అది కేసీఆర్​కు తప్ప మరెవరికీ తెలియదు! అంబేద్కర్​ను నూతన సెక్రటేరియెట్​భవన్​లో చూడాలను కుంటున్న కేసీఆర్.. దళితుల జీవితాల్లో మాత్రం వెలుగును చూడలేకపోతున్నారు ఎందుకు? దళితుల జీవితాలకు శాశ్వత పరిష్కారం చూపే ముడెకరాల భూమిలో అంబేద్కర్​నిత్యం కనిపించి ఉండేవారోమో కానీ, తాత్కాలిక తాయిలాలతో ఓట్లు రాల్చుకునే ప్రయత్నాల్లో ఆయన ఎన్నడూ ఉండరు. తెలంగాణలో19 శాతం దళితులున్నారని సమగ్ర సర్వేలో తేలింది. మరి మంత్రి వర్గంలో ఎందరు దళితులున్నారు? ఉన్నది ఒకే ఒక్క దళిత మంత్రి. మరో ముగ్గురు దళితులకు మంత్రి పదవులు ఎందుకు ఇయ్యలేదు? దళిత ముఖ్యమంత్రి హామీ సరే సరి. కనీసం మంత్రివర్గంలోనైనా న్యాయం చేయరా? ఇటు రాజ్యాధికారంలో, అటు భూ పంపకంలో  దళితులను వంచించిన వాళ్లను, అంబేద్కర్​బతికుంటే నిజంగా సహించేవారేనా?

ఉన్న భూమి గుంజుకునుడు
మూడెకరాల భూమి ఇచ్చుడు అటుంచితే, సర్కారు దళితులకు అసైన్​చేసిన​భూములను తిరిగి బలవంతంగా గుంజుకుంటున్నది. ఆ భూములను సాగు చేయడం లేదనో, పట్టా పాస్​బుక్ లేదనో, రెవెన్యూ రికార్టుల్లో కనిపించడం లేదనో, ధరణిలో లేదనో  రకరకాల కారణాలు చూపి, స్వాధీనం చేసుకుంటున్నది. ఉపాధి లేని పేదలకు గత ప్రభుత్వాలు అసైన్డ్​ చట్టం కింద 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉచితంగా కేటాయించింది. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు 22 లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లు ఒక అంచనా.  తెలంగాణలో 38 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 2006లో కొనేరు రంగారావు కమిటీ రిపోర్టు ప్రకారం  సగం అసైన్డ్​ భూములను తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకొని భూస్వాములు లాగేసుకున్నారని తేలింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని భూమి లేని ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వొచ్చని ఆ కమిటీ చెప్పింది. కమిటీ రిపోర్టును సీఎం కేసీఆర్​ చదవలేదా? దళితులకు మూడెకరాల భూమి అమలు చేసేందుకు ఆయనకు చేతులు రావడం లేదెందుకు? డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు, శశ్మాన వాటికలు, ప్రాజెక్టులు, ఫార్మాసిటీల నిర్మాణం కోసమని ప్రభుత్వం దళితుల అసైన్డ్​ భూములను అక్రమంగా లాగేసుకుంటున్నది. ఎక్కడైనా దళితులు మర్లపడితే  ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నది. ఇయ్యాల తెలంగాణలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు నాయకుల ఆక్రమణల్లో ఉన్నాయి. వాటి జోలికి మాత్రం కేసీఆర్​సర్కారు​పోవడం లేదు. 

– కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ