- దళితుల భూములు కొని ప్రభుత్వానికి సరెండర్ చేసిన టీఆర్‌ఎస్ లీడర్లు
- ఆందోళనకు దిగిన నిర్వాసితులను పీఎస్ చుట్టూ తిప్పిన్రు
- ప్రతిపక్షాలు అండగా నిలవడంతో చర్చలకు పిలిచిన కలెక్టర్
- భూమి తప్ప మరేమీ వద్దని పట్టుబట్టిన నిర్వాసితులు
నాగర్ కర్నూల్, వెలుగు: ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా భూములు సేకరించాలంటే చట్టం, ప్రాసెస్ ఉంటుంది. కానీ, నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ భూసేకరణలో అధికార పార్టీ లీడర్లు ఏ చట్టాన్నీ పట్టించుకోలేదు. తమ భూములు రేట్లు పెంచేందుకు దళితుల భూములను ఎరగా వేశారు. మెడికల్ కాలేజీ వస్తే ఉయ్యాలవాడ గ్రామం బాగుపడుతుందని నమ్మించి.. ఎకరాకు నాలుగైదు లక్షలు ఇచ్చి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇప్పుడు అక్కడ రూ.2 కోట్లకు పైగా పలుకుతుండడంతో అసలు విషయం అర్థమైన దళితులు ధర్నాకు దిగితే.. టెంట్ పీకి మహిళలు, పిల్లలు, వృద్ధులని చూడకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. బాధితులకు కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, బీఎస్పీ, వామపక్షాలు ప్రజా సంఘాలు మద్దతుగా నిలవడంతో కలెక్టర్ చర్చలకు పిలిచారు. కలెక్టర్ తరఫున అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ, తమకు భూమి తప్ప మరేమీ వద్దని నిర్వాసితులు పట్టుబట్టడంతో సమస్య తీవ్రంగా మారింది.
గైరాన్ భూముల బాగుంటాయని సలహా..
గ్రామంలోని 237 సర్వే నెంబర్‌లో 77.22 ఎకరాల గైరాన్ భూములు ఉన్నాయి. ప్రభుత్వం ఈ భూములను సాగు చేసుకుంటున్న దాదాపు 70 మంది దళిత రైతులకు 50 ఏళ్ల క్రితం లావుని, భూదాన్ పట్టాలిచ్చింది. ఇందులో కనిష్టంగా 20 గుంటల నుంచి గరిష్టంగా 6 ఎకరాల వరకు పట్టాలు పొందిన వారున్నారు. అనంతరం ఈ భూములను 22–ఎ(1)(ఎ)1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. ఏడాది కింద జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ఆఫీసర్లు భూమి కోసం వెతుకున్న క్రమంలో టీఆర్‌ఎస్ లీడర్లు ఉయ్యాలవాడలోని గైరాన్ భూములు బాగుంటాయన్న ప్రపొజల్ పెట్టారు. కాలేజీతో తమ గ్రామం బాగుపడుతుందన్న సెంటిమెంట్ కలిపారు. అధికార పార్టీ కావడంతో ఆఫీసర్లు కూడా ఏమీ ఆలోచించకుండా 37 మంది దళితుల నుంచి 33 ఎకరాల భూమి సేకరించారు. ఇందులో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ నిర్మాణం చేపట్టాలని భావించారు. కానీ, నర్సింగ్ కాలేజీని నిర్మించి తర్వాత దాన్నే మెడికల్ కాలేజీగా మార్చేశారు.
ప్రభుత్వ భూమి ఉన్నా..
వాస్తవానికి ఉయ్యాలవాడలో సర్వే నెంబర్ 3 నుంచి 307 సర్వే నెంబర్లకు వరకు దాదాపు 49 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని వివిధ వర్గాలకు చెందిన 298 మంది సాగు చేసుకుంటున్నారు. కానీ, కేవలం దళితుల భూములే తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వీళ్ల భూములకు చుట్టు పక్కల టీఆర్‌ఎస్ లీడర్ల భూములు ఉండడంతో ఆఫీసర్లు ఈ ప్రపోజల్‌ను ఓకే చేసినట్లు తెలిసింది. బాధిత రైతులకు ఎకరాకు రూ. 4 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా అధికార పార్టీ లీడర్లే డబ్బులు ఇచ్చి.. ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు అప్పటి అడిషనల్ కలెక్టర్ ముందు ఫారం–సీపై సంతకాలు పెట్టించారు.
రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యం
దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు సేకరించాలంటే 2013 భూసేరణ చట్టం ప్రకారం పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలి. అనంతరం సర్వే చేసి మార్కెట్ రేట్‌కు మూడింతలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నాగర్ కర్నూల్ ఏరియాలో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎకరాకు రూ.3లక్షల వరకు ఉంది. అంటే ఎకరాకు దాదాపు రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నిర్వాసితుల డిమాండ్ మేరకు కొంత ఎక్కువ కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది. కానీ, రెవెన్యూ ఆఫీసర్లు టీఆర్‌ఎస్ లీడర్లు చెప్పినట్లు ఆడారు. ఉయ్యాలవాడ అభివృద్ధి కోసం దళితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వాళ్లు చెప్పిన కథనే వినిపించారు.
మా భూమి మాగ్గావాలె
మెడికల్ కాలేజీకి భూములు కావాలని అడగలేదు. సర్వే చేయడానికి ఆఫీసర్లు వస్తున్నరు సంతకాలు పెట్టమంటే పెట్టిన. నాకు 6 ఎకరాలు ఉంటే రూ.20 లక్షలు ఇచ్చిన్రు. కాలేజీకి మా భూములే దొరికినయా..? నా భూమి నాకు కావాలె.
–రాములు, ఉయ్యాలవాడ
కాలేజీ కోసం దళితులను బలి చేయొద్దు
జిల్లాకు మెడికల్ కాలేజీ రావడాన్ని స్వాగతిస్తున్న. కానీ, కాలేజీ కోసం ఉయ్యాలవాడ దళితులను బలిచేయడం న్యాయం కాదు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం అసైన్డ్ భూములకు నోటిఫికేషన్ జారీ చేసి మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించాలి. ఇవేమీ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు భూములు సేకరించడం, దానికి రెవెన్యూ అధికారులు సరే అనడం అనైతికం. దళితులకు అన్యాయం జరిగితే అఖిలపక్షం ఆధ్వర్యంలోజాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్త. ఇప్పటికే కలెక్టర్‌కు లెటర్ రాసిన.
–నాగం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి
మా మామ గుండె ఆగి సచ్చిండు
మాకు ఉన్నది ఎకరా పొలం. మా మామతోటి సంతకం పెట్టించుకుని వస్తే రూ. 6 లక్షలు ఇస్తమన్నరు. సంతకం పెట్టిన అర్ద గంటకే మా మామ గుండె ఆగి సచ్చిండు. రూ. 1.20 లక్షలు చేతిలో పెట్టి సరిపోయినై పో అన్నరు. మా భూమిని అన్యాయంగా గుంజుకున్నరు.
–నాగమ్మ, ఉయ్యాలవాడ