కామారెడ్డి జిల్లాలో దళితబంధు కోసం ఆందోళనలు

  •     కలెక్టరేట్​ ఎదుట పెద్దమల్లారెడ్డి వాసుల ధర్నా
  •     దోమకొండలో ఎంపీడీవో ఆఫీస్​ వద్ద బైఠాయింపు
  •     ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లకుండా అడ్డగింత

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు :  దళితబంధు కోసం కామారెడ్డి జిల్లాలో రెండు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డికి చెందిన దళితులు ట్రాక్టర్లలో  కలెక్టరేట్​ఆఫీసుకు వచ్చారు. గ్రామంలో 250 దళిత కుటుంబాలుంటే కేవలం 15 మందికే ఇచ్చారని, మిగతావారికి కూడా ఇవ్వాలంటూ కలెకర్టేట్​ఎదుట ధర్నా నిర్వహించారు.

గ్రామంలోని బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులకు వారికి అనుకూలంగా ఉన్న వారికే దళితబంధు ఇచ్చారని ఆరోపించారు. అర్హులైన ప్రతిఒకరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్​ ఏవోకు వినతిపత్రం అందించారు. 

దోమకొండలో..

దోమకొండ ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట దళితులు ధర్నా చేశారు. అర్హులైన వాళ్లకు దళితబంధు ఇవ్వాలంటూ పలువురు ఎంపీడీవో ఆఫీస్​మెయిన్​డోర్​ ఎదుట బైఠాయించారు. అంతకు ముందే  ఆఫీసులో ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్​గౌడ్, బీఆర్ఎస్​లీడర్లు ఎంపీడీవో ఆఫీసు లోపల   బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్​కిట్లు పంపిణీ చేస్తున్నారు.

వీరిని బయటకు రాకుండా దళితులు డోర్​ ఎదుట గంటన్నర పాటు ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్దపెద్ద బంగ్లాలు ఉన్నవారికే దళితబంధు లబ్ధిదారులుగా గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అందరికి న్యాయం జరిగేలా చూస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో విరమించారు. .