గరిడేపల్లి, వెలుగు: అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన దళితులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో కోదాడ, మిర్యాలగూడెం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తోందని ఆరోపించారు.
లబ్ధిదారుల జాబితాలో పేదల పేర్లు కాకుండా బీఆర్‌ఎస్ నేతల కుటుంబాలకు చెందిన ఇద్దరు, ముగ్గురి పేర్లు ఉన్నాయని మండిపడ్డారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. ఇందులో పొలం, ఇండ్లు ఉన్నవారితో పాటు ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిపొందిన వారూ ఉన్నారన్నారు. ధర్నాకు బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడుపోకల వెంకటేశ్వర్లు, సీపీఎం మండల కార్యదర్శి షేక్ యాకుబ్, బీఎస్పీ నాయకులు రాపోలు నవీన్ కుమార్, జిలకర రామస్వామి సంఘీభావం తెలిపారు.