- జిల్లాలో పూర్తికాని గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారుల ఎంపిక
- ఎన్నికలు సమీపిస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన
కామారెడ్డి, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. కానీ జిల్లాలో గృహలక్ష్మి, దళితబంధు తదితర పథకాల లబ్ధిదారుల ఎంపిక ఇంకా ఫైనల్ కాలేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్రిలీజ్ చేసేందుకు టైమ్ దగ్గరికొస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేసే బాధ్యత ఆఫీసర్లదే అయినా, స్థానిక ఎమ్మెల్యేలు ఒకే చెప్పిన వారికే ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేస్తున్నారు.
రెండో విడతలో నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. గృహలక్ష్మి కింద సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నారు. ఈ స్కీమ్‌లకు సంబంధించి లబ్ధిదారుల సెలక్షన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎలక్షన్ ముందు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది.
నియోజకవర్గానికి కేటాయించిన దానికి నాలుగైదు రెట్లు ఎక్కువ అప్లికేషన్లు రావడంతో ఒకరికి వచ్చి, మరొకరికి రాకపోతే ఓటు బ్యాంక్ దెబ్బతింటుందని ప్రజాప్రతినిధులు యోచిస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్వచ్చే అవకాశమున్నందున, షెడ్యూల్ కంటే ముందే లబ్ధిదారుల ఎంపికతో పాటు, వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంది.
మండల స్థాయిలోనే గృహలక్ష్మి..
గృహలక్ష్మి పథకం ఇటీవల అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. జిల్లాలో మొత్తం 28,622 మంది దరఖాస్తు చేసుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 9391, ఎల్లారెడ్డిలో 11348, జుక్కల్‌లో 6171, బాన్సువాడలో 1,712 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫీల్డ్ లెవల్లో పరిశీలన పూర్తిచేసిన టీమ్స్, మండల స్థాయి ఆఫీసర్లకు నివేదించారు. ఇక్కడి నుంచి జిల్లా స్థాయికి రావాల్సి ఉంది.
సెలక్టయిన లబ్ధిదారులకు రూ.3 లక్షలు మంజూరైనట్లు ప్రొసీడింగ్స్ ఇస్తారు. ప్రభుత్వ యంత్రాంగం అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారిని సెలక్ట్ చేయాల్సి ఉంది. కానీ తుది ఎంపికలో బీఆర్ఎస్ లీడర్లు చెప్పిన పేర్లనే ఎమ్మెల్యేలు ఓకే చేసే ఛాన్స్ ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
దళితబంధు అర్హుల్నీ తేల్చలేదు..
దళిత బంధు రెండో విడతలో నియోజకవర్గానికి 1100 మందిని సెలక్ట్ చేసి, రూ.10 లక్షల ఆర్థికసాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లాలో 3,850 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. (బాన్సువాడ నియోజకవర్గంలో సగం మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నందున సగం మంది లబ్ధిదారులను అక్కడ సెలక్షన్చేస్తారు) ఒక్కో నియోజకవర్గంలో అయిదారు మండలాలున్నాయి. దళితబంధు స్కీమ్‌ద్వారా లబ్ధికి ఎక్కువ మంది ఆశిస్తుండగా, శాంక్షన్ మాత్రం తక్కువగా ఉన్నాయి. మండలానికి 150 నుంచి 200 మందికి మించి సెలక్షన్ చేసే వీలులేదు.
నియోజకవర్గానికో స్పెషల్ఆఫీసర్ కలెక్టర్‌కు లిస్టు పంపాల్సి ఉంది. జిల్లాలో ఇంకా లిస్టు ఫైనల్ కాలేదు. అయితే అధికార పార్టీకి చెందిన వారినే లిస్టులో చేర్చుతున్నారని పలువురు ఇటీవల ఆందోళన చేశారు. అర్హులకే దళితబంధు ఇవ్వాలంటూ పిట్లం మండలానికి చెందిన పలువురు దళితులు కలెక్టరేట్‌కు వచ్చి ధర్నా చేశారు. దోమకొండ, బీబీపేట మండలాల్లోనూ దళితులు ఆందోళనలు చేస్తున్నారు.