
- డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను మొదట్లో ఖండించిన సర్కారు పెద్దలు, ఇరిగేషన్ ఆఫీసర్లు
- తీరా మూడు బ్యారేజీలకు ప్రమాదమని తెలిసి మొత్తం రిజర్వాయర్లు ఖాళీ
- ఇదివరకే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నుంచి వాటర్ రిలీజ్
- తాజాగా సుందిళ్ల బ్యారేజీ 8 గేట్లు ఎత్తిన ఆఫీసర్లు
- మూడు రిజర్వాయర్ల నుంచి 23 టీఎంసీలు సముద్రంపాలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కుంగిన మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీలన్నీ ప్రమాదంలో ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నిల్వ చేయవద్దని నేషనల్డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట్లో ఖండించిన రాష్ట్ర సర్కారు పెద్దలు, ఇరిగేషన్ ఆఫీసర్లు తాజాగా దిగివచ్చారు. బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నట్లు తమ పరిశీలనలోనూ తేలడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను గుట్టుగా ఖాళీ చేస్తున్నారు.
ఇప్పటికే మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం (సరస్వతి) బ్యారేజీల గేట్లు ఎత్తి వాటర్ రిలీజ్ చేసిన ఇంజినీర్లు, తాజాగా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ గేట్లను కూడా ఎత్తారు. ఫలితంగా సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే 23 టీఎంసీల నీళ్లన్నీ వృథాగా సముద్రంపాలయ్యాయి. రాష్ట్ర సర్కారు.. ప్రభుత్వ ఇంజినీర్ల వైఫల్యం, డిజైన్ లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఇటీవల సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్ కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది.
అన్నారం బ్యారేజీ పియర్స్ కింద బుంగలు ఏర్పడడానికి కూడా ఇదే కారణమని తేల్చింది. ఇదే డిజైన్‌తో నిర్మించిన సుందిళ్ల బ్యారేజీకి కూడా ముప్పు పొంచి ఉందని నివేదికలో చెప్పింది. మొన్నటిదాకా ఇది దురుద్దేశంతో కూడిన నివేదిక అంటూ, చిన్న పర్రెను పెద్దది చేసి చూపుతున్నారంటూ తప్పించుకోజూసిన ప్రభుత్వ పెద్దలు, ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు తీరా ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగారు. చాలా గుట్టుగా రిపేర్లు చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ పునర్నిర్మాణం కోసం బ్యారేజీకి ఎగువన, దిగువన కాఫర్ డ్యామ్ కట్టాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే మూడు బ్యారేజీలలో నిల్వ చేసిన నీళ్లను గేట్లు ఎత్తి వృథాగా కిందికి వదిలేస్తున్నారు.
23 టీఎంసీల గోదారి నీళ్లు వృథా
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరిపై భూపాలపల్లి జిల్లా మహదేవ్‌ఫూర్ మండలం అంబట్‌పల్లి దగ్గర మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం గ్రామం దగ్గర అన్నారం( సరస్వతి), పెద్దపల్లి జిల్లా సిరిపురం దగ్గర సుందిళ్ల(పార్వతి) బ్యారేజీలు నిర్మించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నీరు గోదావరిలో కలిసే చోటికి సుమారు 20 కిలోమీటర్ల దిగువన 16.17 టీఎంసీల కెపాసిటీతో మేడిగడ్డ బ్యారేజీ కట్టారు. ఈ నీటినే బాహుబలి మోటార్ల సాయంతో రివర్స్ పంపింగ్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా మొదట అన్నారం బ్యారేజీలోకి.. అక్కడి నుంచి సుందిళ్లలోకి, అక్కడి నుంచి ఎల్లంపల్లిలోకి రివర్స్ పంపింగ్ చేస్తారు.
కాంగ్రెస్ హయాంలో15 ఏండ్ల కింద గోదావరిపై ఎల్లంపల్లి బ్యారేజ్ కట్టినా ఎలాంటి లోపాలు బయటపడలేదు. కానీ, కాళేశ్వరం రిజర్వాయర్లను ప్రారంభించి నాలుగున్నరేళ్లే అవుతుండగా, అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ (పియర్) భూమి లోకి కుంగిపోగా, మరో ఆరు పియర్లూ దెబ్బతిన్నాయి. బ్యారేజీ కుంగిపోవడం ప్రారంభించడంతో ఇరిగేషన్ ఆఫీసర్లు పోలీసుల సాయంతో బ్యారేజీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అప్పటికే రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న 10 టీఎంసీల నీళ్లను గేట్లు ఎత్తి సముద్రం వైపు వదిలేశారు. ఈ క్రమంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని టీమ్ అక్టోబర్ 24న మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి కేంద్రానికి, రాష్ట్రానికి నివేదిక పంపించింది. తర్వాత అన్నారం బ్యారేజీలో బుంగలు బయటపడ్డాయి. అప్పటికే ఆ బ్యారేజీలో 8 టీఎంసీల నీళ్లుండగా గేట్లు తెరిచి దాన్ని కూడా ఖాళీ చేశారు. ఈలోగా సెంట్రల్ టీం రిపోర్ట్ తర్వాత సుందిళ్లనూ ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో 5 టీఎంసీలుండగా, గురువారం 8 గేట్లు ఎత్తి కిందికి విడిచిపెడ్తున్నారు. మొత్తంగా మేడిగడ్డ కుంగేనాటికి మూడు రిజర్వాయర్లలోని 23 టీఎంసీలను ఆఫీసర్లు ఖాళీ చేసేశారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక మేరకే..
'మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ, కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ అంశాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.. ప్లానింగ్ ప్రకారం డిజైన్ జరగలేదు.. రూపొందించిన డిజైన్ ప్రకారం కూడా నిర్మాణం జరగలేదు..' అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. నిర్మాణంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, ఇది ఘోర తప్పిదమని టీమ్ చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తేల్చింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌ను పూర్తిగా తొలగించి పునర్నిర్మించాలని సూచించింది. ఇతర బ్లాక్ లతో పాటు మిగిలిన రెండు రిజర్వాయర్ల సైతం బలహీనంగా ఉన్నందున రిపేర్లు , చెకింగ్లు పూర్తయ్యేదాకా నీళ్లు నిల్వ చేయవద్దని స్పష్టం చేసింది. మొదట్లో ఈ నివేదికను ఖండించిన ఇరిగేషన్ ఇంజినీర్లు, ఇప్పుడు మొత్తం బ్యారేజీలకే ప్రమాదం ఉందని తమ పరిశీలనలోనూ తేలడంతో యుద్ద ప్రాతిపదికన రిపేర్లు చేపట్టేందుకే అన్ని రిజర్వాయర్లను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది.
‘ఖని’ గోదావరిలో తేలిన ఇసుక
గోదావరిఖని : గోదావరిఖనిలో నాలుగేండ్లుగా నిండుగా కనిపిస్తున్న గోదావరి ఇప్పుడు బోసిపోయింది. నదిలో రెండు వైపులా ఒడ్డును తాకుతూ ప్రవాహం ఉండేది. కానీ, ఇప్పుడు నీరు ఖాళీ అవుతుండడంతో ఇసుక తేలి కనిపిస్తున్నది. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిన నేపథ్యంలో సెంట్రల్ డ్యామ్ సేప్టీ ఆఫీసర్లు మిగిలిన బ్యారేజీలకు కూడా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో పార్వతి (సుందిళ్ల) బ్యారేజీలోని నీటిని ఖాళీ చేస్తున్నారు.
ఈ కారణంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గోదావరికి ఒడ్డున ఉన్న పంట భూములు బయట పడుతున్నాయి. దీంతో ఏదైనా పంట వేసుకునే అవకాశం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పార్వతి బ్యారేజీలో నీటి నిల్వ కెపాసిటి 8.83 టీఎంసీలు కాగా, జూన్‌లో 7.70 టీఎంసీలు నిల్వ చేశారు. వారం రోజులుగా నీటిని దిగువకు వదులుతుండడంతో గురువారం నాటికి అది రెండు టీఎంసీలకు పడిపోయింది. కొద్ది రోజుల్లో బ్యారేజీలోని నీరు పూర్తిగా వదిలి పిల్లర్లను చెక్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.