అన్నారం, మేడిగడ్డలో డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు

  • సీపేజీ, కుంగిన 7వ బ్లాక్​ల పరిశీలన
  • వర్షాకాలంలోపు రిపేర్లు పూర్తి కావని అంచనా
  • ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిందేనని సూచన

జయశంకర్‌‌  ‌‌భూపాలపల్లి/మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి వర్షాకాలంలోపు నీళ్లు పారేలా సరిచేయకపోతే బ్యారేజీ 7వ బ్లాక్ లోని పిల్లర్లు పూర్తిగా కూలిపోయే  ప్రమాదం ఉందని స్టేట్‌‌‌‌  డ్యామ్‌‌‌‌  సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌ఓ) నిపుణుల బృందం హెచ్చరించింది. ఇరిగేషన్  అడ్మిన్  గుమ్మడి అనిల్  కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్  మండలంలోని అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను మైనింగ్ ఇన్వెస్టిగేషన్  ఆఫీసర్ మోరం రాములు, ఓ అండ్ ఎం సీఈ పరిమళ, ఎస్ఈ మురళీకృష్ణ , డీఈ సతీశ్,  సీడీవోఎస్ఈలు  ఎంఎస్ఎం రెడ్డి , శ్రీనివాస్, ఈఈ దయాకర్  రెడ్డి తదితరులు సందర్శించారు.

ముందుగా అన్నారం బ్యారేజీలో ఏర్పడిన సీపేజీలను పరిశీలించారు. తర్వాత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌‌‌‌ ను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్  వన్  బ్యారేజీల మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితులలో ఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌ఓ బృందం ముందుగా అన్నారం బ్యారేజీ చేరుకుంది. టీం సభ్యులు  బ్యారేజీ కిందికి దిగి డౌన్ స్ట్రీం లో సీపేజీలకు గురువుతున్న పియర్స్‌‌‌‌ (పిల్లర్లు) ను, బుంగలు పడిన  ప్రాంతాలను పరిశీలించారు.  గత శుక్రవారం సీపేజ్ తో వైరల్  అయిన పిల్లర్  వద్ద పరిస్థితిని గమనించారు. ఇప్పటి వరకు బ్యారేజీ డ్యామేజీకి గురికాకుండా తీసుకున్న జాగ్రత్తలను, చేసిన పనులను ఈఈ యాదగిరి వారికి వివరించారు. ముందుగానే పిల్లర్ల వద్ద సీపేజీలను గుర్తించి గ్రౌటింగ్  వర్క్  చేయించామని ఆయన తెలిపారు.

ఒక్క గేట్‌‌‌‌ ఎత్తకున్నా బ్యారేజీ కూలుడు ఖాయం

మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న స్పెషల్  బృందం సభ్యులు 7వ బ్లాక్ లో కుంగిన ప్రాంతాన్ని బ్రిడ్జ్ పై నుంచి చూశారు. మహారాష్ట్ర వైపు నుంచి బ్యారేజీ అప్  స్ట్రీంలో కిందికి చేరుకొని కుంగిన బ్లాక్ లోని 19, 20, 21వ పిల్లర్లను గమనించారు. వర్షాకాలంలోపు ఎంత వర్క్  చేయగలం అనే విషయంపై ఇరిగేషన్‌‌‌‌  శాఖ లోకల్‌‌‌‌  సీఈ సుధాకర్  రెడ్డి, స్థానిక ఇరిగేషన్  ఇంజనీర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బ్యారేజీ పూర్తిగా కూలిపోకుండా ఏం చేయాలో చర్చించారు. మూడు నెలల్లో రిపేర్  వర్క్  పూర్తి కాదని, వర్షాకాలంలో వరదలు తట్టుకునేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఇంజినీర్లకు బృందం సభ్యులు సూచించారు.

గోదావరిలో వచ్చే వరదల సమయంలో బ్యారేజీలోని 84 గేట్లు తెరిచి 7వ బ్లాక్ లో కుంగిన పిల్లర్ల వద్ద గల ఒక్క గేట్  మూసి ఉంచినా బ్లాక్  మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కుంగిన పిల్లర్  వద్ద గేటు ఎలా తెరవాలన్న విషయంపై చర్చించారు. పిల్లర్ పైన ఉన్న గేర్ బాక్స్ వల్ల తలెత్తే ఇబ్బందులు, గేటు తెరవడానికి సైడ్ కు అమర్చిన బీడింగ్ లను కట్ చేసి గేటు ఎత్తితే జరిగే పరిణామాలను అంచనా వేశారు. కాగా, వర్షాకాలం వచ్చేలోగా మైనర్  రిపేర్లు పూర్తిచేసి బ్యారేజీ వద్ద ఫ్రీ ఫ్లో ఏర్పాటు చేసి బ్యారేజీ కూలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని లోకల్‌‌‌‌  ఇంజినీర్లు తెలిపారు. 

లోకల్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌  ఇంజినీర్ల టెన్షన్‌‌‌‌ 

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో పనిచేసి ప్రస్తుతం వేర్వేరు చోట్లలో పనిచేస్తున్న కొందరు ఇరిగేషన్  ఆఫీసర్లు మంగళవారం ఎస్‌‌‌‌డీఎస్‌‌ఓ బృందం పర్యటనలో పాల్గొన్నారు. చాలా రోజుల తరువాత ఇంజినీర్లు బ్యారేజీ నిర్మాణ సమయంలోని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నాలుగేండ్లు నిద్రాహారాలు మాని బ్యారేజీ నిర్మాణానికి కృషిచేస్తే ఆ పేరే లేకుండా పోయిందని బాధపడ్డారు. ఉన్నతాధికారులు చెప్పినట్టు చేశామని, ఇప్పుడు ఇలా జరగడంతో తమ పరువు పోయిందన్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.