
మహబూబ్నగర్రూరల్/అడ్డాకుల/ఆమనగల్లు/జడ్చర్ల/లింగాల, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు నష్టపోయారు. రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరమర్శించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. చౌదర్ పల్లి, బొక్కలోనిపల్లి, జమిస్తాపూర్, రాంచంద్రాపూర్ తదితర గ్రామాల్లో 1,520 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. మూసాపేట మండలం చక్రపూర్ గ్రామంలో 17 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. మాడ్గుల్ మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి ఇర్విన్, అన్నె బోయిన్ పల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో మొక్కజొన్న, సజ్జ పంటలు నేలవాలాయి. అకాల వర్షానికి 357 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏవో అరుణకుమారి తెలిపారు.
జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో ఆధివారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. గ్రామానికి చెందిన గోపాల్రెడ్డికి చెందిన 8 ఎకరాల మామిడితోటలో కాయలు రాలిపోయి నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో లింగాల వార సంతలో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందిపడ్డారు. మారుమూల గ్రామాల నుంచి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది.