అభివృద్ధి చెందిన దేశాల బహుళజాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ ‘మురికి’ పరిజ్ఞానాన్ని అమ్మి, లక్షలకు లక్షల కోట్లు దోచుకోడం పరిపాటిగా మారింది. ఇలాంటి వ్యవస్థలు మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందడానికి దళారుల వ్యవస్థలు సహాయ సహకారాలు సర్వసాధారణంగా మారిపోయాయి. మన దేశ వ్యవసాయంలో పశుపోషణ ముఖ్య భాగంగా ఉండేది. దీనివల్ల రైతుకు ఆదాయం, భార్యాబిడ్డలకు పౌష్టికాహారం లభించేది. 1960 తరువాత వచ్చిన ‘హరిత విప్లవం మహమ్మారి’ ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించింది. దీనికి ముందు రైతులు తమ పొలాల్లో గానీ, పక్క రైతు పొలాల్లోగానీ పండించిన మంచి గింజలను విత్తనాలుగా వాడుకునేవారు. దీనివల్ల పనికిమాలిన కల్తీ విత్తనాల బెడద ఉండేదికాదు. అలాగే పశువు పేడను ఎరువుగా వాడుకునేవారు. ఇప్పుడు దాని స్థానంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల రైతు కు వ్యవసాయ ఖర్చు పెరిగింది. భూసారం దెబ్బతిన్నది. మానవుల ఆరోగ్యం దెబ్బ తినడం జరుగుతున్నది. దీనితో ప్రజలు ఆరోగ్యంపై చేసే ఖర్చు పెరిగింది. దీనివల్ల మందుల కంపెనీలు కార్పొరేటు ఆసుపత్రులు లక్షల కోట్లు ఆర్జిస్తున్నాయి. అంతేకాదు, వీరు పర్యావరణాన్ని కాలుష్యంతో నింపుతున్నారు. దీనితో మరలా కొత్త కొత్త జబ్బులు ప్రబలుతున్నాయి.
ఇదొక విష విలయంగా..
హరిత విప్లవ వ్యవసాయంలో రసాయనిక ఎరువులను వినియోగించుకొని అధిక దిగుబడులు తెచ్చుకునేందుకు శాస్త్రవేత్తలు-, రైతులు కొత్త వంగడాలను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీనితో బహుళజాతి సంస్థలు , అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జన్యు సంపదను దోచుకుపోయి, దేశవాళి వంగడాల స్థానంలో బహుళజాతి సంస్థలు మన జన్యు సంపద నుంచి జన్యుమార్పిడి విత్తనాలను తయారు చేసి, వాటిని మనదేశంలోకి 2000 తర్వాత దొంగచాటుగా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వాల అనుమతులు లేకుండా దుర్మార్గపు మధ్యవర్తుల ద్వారా ఆ విత్తనాలను అమాయక రైతులకు అంటగట్టడం జరిగింది. ప్రభుత్వాలు ఇలాంటి చట్ట వ్యతిరేక విధానాలపై ఎలాంటి చర్యలు తీసుకొకపోగా, వారికి వెన్నుదన్నుగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు 2003 రాష్ట్ర హైకోర్టులో కేసు వేయడం జరిగింది. జన్యుమార్పిడి పత్తి విత్తనాలపై వేసిన ఆ కేసు కీలక దశకు చేరుకున్న దశలో మా తరఫు న్యాయవాది దారి తప్పడం జరిగింది. కేసు ఆగిపోయింది. ఇప్పుడు జన్యుమార్పిడి పరిశోధనలకు ఆగమేఘాల మీద ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ జన్యుమార్పిడి విత్తనాల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి చేసిన వంగడాలతో పోలిస్తే, జన్యుమార్పిడి వంగడాల వల్ల దిగుబడులు పెరగవు, కానీ ఖర్చు పెరుగుతుంది. పంటలకు కొత్త రోగాలు, పురుగులు ఆశించడం ఎక్కువవుతుంది. వీటి వల్ల పక్క పొలాలకు రోగాలు రావడం, ఆ పంటలు దెబ్బ తినడం లాంటివి జరుగుతాయి. జన్యుమార్పిడి విత్తనాలను ప్రతి మూడేండ్లకు ఒకసారి కొత్త విత్తనాలుగా అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఇలా అభివృద్ధి చేసుకున్న వంగడాలు పని చేయకపోవడంతో .. ఐక్యరాజ్య సమితి బహిష్కరించిన బీజీ-2 , బీజీ-3 వంగడాలను దొంగచాటుగా దేశంలోకి తెచ్చి విక్రయిస్తూ పంటలు పండిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్రం ప్రభుత్వాలు గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడ లేదు. విత్తన మార్కెట్లను వారి చెప్పుచేతల్లో పెట్టుకొని, దేశవాళి వంగడాలను విత్తన మార్కెట్లలో అమ్మకుండా చేస్తున్నా.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నాయి. తెలంగాణలోకి పక్క రాష్ట్రాల నుంచి పనికి మాలిన విత్తనాలను తెచ్చి రైతులను నష్టాల ఊబిలోకి నెడుతున్నారు. పరోక్షంగా ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నారన్నమాట! ఇన్ని అనర్థాలకు మూలంగా ఉన్న విత్తన వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశలో ‘ఈడీ’ గానీ, ‘ఐటీ’ గానీ ఇతర ఏ సంస్థలు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?
బలయ్యేది సాధారణ ప్రజల ఆరోగ్యాలే
జన్యుమార్పిడి విత్తనాల అనర్థాలు ఇక్కడే ఆగడం లేదు, జన్యుమార్పిడి ఆహారాన్ని మనపై రుద్దారు, రుద్దబోతున్నారు కూడా. దీని వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఎలాగ ఉంటుందో తెలియదు, మనుషులకు ఎలాంటి పిల్లలు పుట్టబోతారో మనకు తెలియదు, ప్రభుత్వాలు జన్యుమార్పిడి విత్తనాల మంచి చెడులపై నిపుణులతో లోతుగా చర్చించాల్సిన అవసరం ఇప్పటికీ ఉన్నది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కొన్ని జన్యుమార్పిడి విత్తనాల నిషేధాలు విధించినపుడు, అవి మన దేశంలో వాడుకలో ఉంటే ఏమేరకు మంచిది? పాలకుల దోషాల వల్ల జన్యుమార్పిడి విత్తనాలు, పంటలతో మనుషుల ఆరోగ్యాలే బలి కావల్సిన పరిస్థితులు రాకూడదని కోరుకుందాం. కానీ కొందరి కక్కుర్తి దేశ నాశనానికి పునాదులు వేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!!
- డా. సజ్జల జీవానంద రెడ్డి
యూఎన్, మాజీ చీఫ్ టెక్నికల్ అడ్వయిజర్