2 లక్షల ఎకరాల్లో మామిడికి దెబ్బ...అమ్మితే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు

2 లక్షల ఎకరాల్లో మామిడికి దెబ్బ...అమ్మితే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు
  • 2 లక్షల ఎకరాల్లో మామిడికి దెబ్బ
  • వడగండ్ల వానలకు 75 శాతం పాడైన తోటలు 
  • 12 లక్షల నుంచి 3 లక్షల టన్నులకు పడిపోనున్న దిగుబడి 
  • రాలిన కాయలు అమ్మితే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు

హైదరాబాద్‌‌, వెలుగు:  వడగండ్ల వాన, ఈదురుగాలులతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోయిన నెల, ఈ నెలలో కురిసిన అకాల వర్షాలకు కాయలన్నీ రాలిపోయాయి. చెడగొట్టు వానలతో కాయలు మొత్తం రాలిపోయాయని, రూపాయిలో పావలా వంతే పంట మిగిలిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 3.05 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.

ఏటా దాదాపు 12 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. అయితే ఈసారి ఎప్పుడూ లేని విధంగా మామిడి తోటలు 70 నుంచి 80 శాతం దెబ్బతిన్నాయి. దాదాపు 2 లక్షల ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయని, ఈ ఏడాది దిగుబడి 3 లక్షల టన్నుల లోపే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

‘‘కాయ ఎదిగే క్రమంలో పోయిన నెలలో కురిసిన చెడగొట్టు వానలకు చాలావరకు తోటలు దెబ్బతిన్నాయి. మిగిలిన కాయలన్నా తెంపుకుందామంటే ఈసారి వడగండ్ల వాన, ఈదురుగాలులతో ఉన్న కాయంతా రాలిపోయింది” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాలిపోయిన కాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదని వాపోతున్నారు. కిలో ఐదారు రూపాయలకే అడుగుతున్నారని, రవాణా ఖర్చులు కూడా వస్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాగా, మన రాష్ట్రంలో ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగామ, హన్మకొండ, జగిత్యాల తదితర జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు ఈ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. తీవ్రంగా నష్టపోయినం.. మాకు 20 ఎకరాల్లో మామిడి తోట ఉంది. వడగండ్ల వానలకు 70 నుంచి 80 శాతం కాయలు రాలిపోయాయి. ఈసారి తీవ్రంగా నష్టపోయినం.

- వంగ నర్సింహరెడ్డి,  వెల్దండ, జనగామ జిల్లా