మేడిగడ్డ సత్తెనాశ్​.. ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ

  • ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ.. నిలువునా చీలిన రెండు పిల్లర్లు
  • ఫౌండేషన్ నుంచి పై వరకూ పగుళ్లు బయటకు వచ్చిన పిల్లర్ రాడ్లు   
  • ఏడో బ్లాకులో 16–22వ పిల్లర్ వరకూ డ్యామేజీలు
  • బ్యారేజీ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు   
  • భారీ నష్టాలను కప్పిపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 
  • మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్​, 
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  
  • అక్కడి పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేసిన నేతలు 

హైదరాబాద్, వెలుగు:  గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం బాగోతం బయటపడ్డది. ఈ ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ బండారం బట్టబయలైంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటనతో బ్యారేజీలో జరిగిన డ్యామేజీ మొత్తం బయటకొచ్చింది. అక్కడ బ్యారేజీ ఏడో బ్లాకులో ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చిన పిల్లర్లు, బయటకు వచ్చిన స్టీల్ రాడ్లు, ఫౌండేషన్​లో బుంగలు పడి బయటకు ఉబికివస్తున్న నీళ్లు, బ్యారేజీ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు దర్శనమిచ్చాయి. ఏడో బ్లాకులోని 20వ పిల్లర్ కింద రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి మొదలు పైన అప్రోచ్ బ్రిడ్జి వరకు నిట్టనిలువునా పగిలింది. కింద కొద్దిగానే కనిపించిన నెర్రె.. పైకి వెళ్లేకొద్దీ మనిషి దూరెంత పెద్దగా ఉంది. ఈ పిల్లర్ లోని స్టీల్ రాడ్లు బయటకు రావడంతో పాటు పిల్లర్ ఎడమవైపు కొంత మేరకు వంగింది. దీనికి తోడు ఈ పిల్లర్ రాఫ్ట్ ఫౌండేషన్ 5 ఫీట్లు కుంగింది. దానికి ఎగువన ఉన్న లాంచింగ్ అప్రాన్​లతో ఫౌండేషన్​కు లింక్ లేకుండా పోయింది. ఇక 16,17,19,21,22వ పిల్లర్లలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. 21వ పిల్లర్​కు అడ్డంగా పగుళ్లు రాగా, 22వ పిల్లర్​లో ఫౌండేషన్ నుంచి పైవరకు నిలువునా పగుళ్లు ఉన్నాయి. 18వ పిల్లర్ ఫాండేషన్​లో బుంగ పడి, నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వెంట్ దిగువ భాగంలోనూ పగుళ్లు వచ్చాయి. ఏడో బ్లాక్​లోని లాంచింగ్ అప్రాన్​ల దిగువ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. ఆ నీటిని భారీ మోటార్లతో తోడుతున్నారు. 

బ్యారేజీ అన్ని బ్లాకుల్లోని డౌన్ స్ట్రీమ్ అప్రాన్ లపై ఏర్పాటు చేసిన సీసీ బ్లాకుల్లో ఒక్కటి కూడా యథాస్థానంలో కనిపించలేదు. అన్ని సీసీ బ్లాకులు నదిలోకి కొట్టుకుపోయాయి. 2019లోనే అవి కొట్టుకుపోయినా, వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేయలేదు. బ్యారేజీ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ ను ఇప్పటివరకు తొలగించలేదు. దానికి దిగువన ఏర్పాటు చేసిన షీట్ ఫైల్స్ ను ఇప్పటివరకు తీసెయ్యలేదు. కాగా, పోయినేడాది మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అక్కడ పెద్దగా నష్టమేం జరగలేదంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కప్పిపుచ్చింది. ఆనాడు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులెవరూ అటువైపు వెళ్లకుండా అడ్డుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ జరిగిన నష్టాన్ని ప్రజల ముందుంచింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి దెబ్బతిన్న బ్యారేజీని చూపించింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అక్కడి పరిస్థితులను చూసి అందరూ విస్మయం వ్యక్తం చేశారు. 

విస్తుపోయిన సీఎం, మంత్రులు.. 

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో నిలువెల్లా వచ్చిన పగుళ్లను చూసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తుపోయారు. ‘ఇలాంటి ప్రాజెక్టు గురించా ఇన్ని రోజులు కేసీఆర్, బీఆర్ఎస్ లీడర్లు గొప్పగా చెప్పింది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరి మధ్యాహ్నం 3:30 గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. నేరుగా బ్యారేజీ ఎనిమిదో బ్లాక్ పక్క నుంచి అప్రోచ్ రోడ్డు ద్వారా గోదావరి నదిలోకి దిగారు. బ్యారేజీ ఫౌండేషన్ వద్దకు చేరుకుని దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పిల్లర్లను పరిశీలించారు. మొదట కుంగిపోయిన 20వ పిల్లర్ ను పరిశీలించి, ఆ పిల్లర్ లో ఫౌండేషన్ నుంచి పైన అప్రోచ్ బ్రిడ్జి వరకు ఏర్పడిన భారీ పగుళ్లను చూసి విస్మయం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మించిన నాలుగేండ్లకే ఇంత డ్యామేజీ కావడానికి కారణాలేమిటని ఇంజనీర్లను అడిగారు. బ్యారేజీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఏకంగా ఐదు ఫీట్లు కుంగిపోవడం, 20వ పిల్లర్ ఎడమ వైపు కాస్త వంగిపోవడంతో.. అసలు బ్యారేజీ నిలిచి ఉండే అవకాశం ఉందా? వరద వస్తే కొట్టుకుపోతుందా? అని ప్రశ్నించారు. 

పనులు కాకముందే ప్రారంభం.. 

2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అయితే పనులు పూర్తికాకముందే బ్యారేజీని ప్రారంభించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్యారేజీ ముందు భాగంలో లాంచింగ్ అప్రాన్ పనులు జరుగుతుండగానే ప్రారంభోత్సవం చేశారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేర్కొన్నారు. పనులు పూర్తికాకముందే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైనట్టు సర్టిఫికెట్ జారీ చేయడంతో పాటు ఎల్అండ్ టీకి బ్యాంకు గ్యారంటీలు రిలీజ్ చేశారని తేల్చారు.  

ఇదా గొప్ప ప్రాజెక్టు? 

అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లను చూసి విస్మయం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రాజెక్టునా తెలంగాణకు లైఫ్ లైన్ అని చెప్పింది. ఈ ప్రాజెక్టు గురించా డిస్కవరీ లాంటి చానెళ్లలో గొప్పలు చెప్పుకుంది’ అని కామెంట్ చేశారు. ‘‘ఎక్కడ నీళ్లు కనిపించినా, అవి కాళేశ్వరం నీళ్లేనని చెప్పారు. బ్యారేజీకి ఇంత నష్టం జరిగితే, నాలుగైదు పిల్లర్లు మళ్లీ కడితే సరిపోతుందని అంటున్నారు. అసలు ఇంత పెద్ద పిల్లర్లను ఎలా తొలగించి, కొత్తగా కడుతారు” అని ఇంజనీర్లను ప్రశ్నించారు. డైమండ్ కట్టింగ్ ద్వారా బ్యారేజీలోని మిగతా భాగాలకు నష్టం జరగకుండా పిల్లర్లు తొలగించి మళ్లీ నిర్మిస్తామని ఇంజనీర్లు వివరించారు. 22వ పిల్లర్ లోనూ నిలువునా పగుళ్లు రావడంతో, దాన్ని చూసి ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. 18వ పిల్లర్ ఫాండేషన్ నుంచి నీళ్లు ఉబికి వస్తుండడం, బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ ను ఇప్పటి వరకు తొలగించకపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మెయింట నెన్స్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిం చారా? అసలు ఈ బ్యారేజీ నిలుస్తుందా? లేదా? అని ఇంజనీర్లను ప్రశ్నించారు. 
నిపుణుల కమిటీ తేల్చాకే నిర్ణయం.. 

Also Read : బాసరలో నేడే వసంత పంచమి వేడుకలు
 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు నిపుణుల కమిటీ విచారణ తర్వాతే.. వాటి భవిష్యత్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మూడు బ్యారేజీలు వరదను తట్టుకుంటాయా? నీళ్లు నిల్వ చేస్తే కొట్టుకుపోతాయా? అనేది తేల్చాల్సింది నిపుణులు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ ముందుకు రాకపోతే, దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్అండ్ టీకి నిర్మాణ పనులకు సంబంధించి రూ.695 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, వాటిని నిలిపివేయడంతో పాటు మొత్తం నిర్మాణ సంస్థనే బ్లాక్ లిస్ట్ లో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.