సులభంగా సంపాదించాలన్న ఆశతో...బెట్టింగ్ ​యాప్స్​తో అనర్థాలు

సులభంగా సంపాదించాలన్న ఆశతో...బెట్టింగ్ ​యాప్స్​తో అనర్థాలు

ఇటీవల సిద్దిపేట కలెక్టర్​ గన్​మెన్ ఒకరు తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి తానూ కాల్చుకుని మృతి చెందాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు ఆన్​లైన్​ బెట్టింగ్​ కారణమని తెలిసింది. బెట్టింగ్ యాప్​ల వల్ల ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్స్​, యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్స్​గా ప్రజలను ప్రభావితం చేయగలుగుతున్నారు.

లక్షలాది మంది ఫాలోవర్స్​ను సొంతం చేసుకుంటున్నారు. దీంతో పలు సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లపై ఆధారపడుతున్నాయి. బ్రాండ్ ప్రమోషన్స్​ కోసం పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాయి. అయితే అత్యాశకుపోతున్న కొందరు ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ యాప్స్​లను​ ప్రమోట్ చేస్తూ ఎంతోమంది ప్రాణ, ఆర్థిక నష్టానికి కారణమవుతున్నారు. 

సులభంగా సంపాదించాలన్న ఆశతో...

ఆన్​లైన్​ గేమ్స్​, బెట్టింగ్ యాప్​ల ద్వారా ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజూ చూస్తున్నాం. ఆన్​లైన్​ గేమ్స్, బెట్టింగ్ వల్ల లక్షల్లో నష్టపోతున్నారన్న వార్తలు తరచూ వింటున్నాం. సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చని సరదాగా మొదలుపెట్టి వ్యసనంగా మారి ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్​లైన్​ ఆటలు ఆడుతున్నవారిలో అత్యధికంగా 72.6 శాతం 18 నుంచి 34 ఏళ్ల వారే. వీరు బెట్టింగ్ యాప్​ల ఉచ్చులో పడుతున్నారు. వినోదం కోసం యూట్యూబ్​ చూస్తే అందులో వచ్చే పెయిడ్ ప్రమోషన్లలో ఈ బెట్టింగ్ యాప్​ల గురించి ప్రచారం చేయడమే దీనికి ప్రధాన కారణం. ఫ్యాక్ట్స్​, ట్రావెల్, వ్లాగ్స్, షార్ట్​ ఫిల్మ్స్​​ వంటి వీడియోలు చేసే యూట్యూబర్స్ అదనపు సంపాదన కోసం ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్​ చేస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించొచ్చని ఆ యూట్యూబర్స్​ చెప్పడం వల్ల చాలామంది ఈ బెట్టింగ్ యాప్​ల వలలో చిక్కుకుంటున్నారు. 

ఈ ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్రకటనలపై  కేంద్ర  సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ క్రికెట్​ ప్రపంచ కప్​ సందర్భంగా ఓ అడ్వైజరీ జారీ చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్​ వంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్​ మీడియాలకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆన్​లైన్​ బెట్టింగ్ యాప్​ సంస్థలు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేయిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ఆఫర్ చేస్తున్నాయి. వినియోగదారులు బెట్టింగ్​లో నష్టపోయిన సొమ్ములో 50 నుంచి 60 శాతం ప్రమోషన్​ చేసినవారికి చెల్లిస్తున్నాయి. దీంతో అత్యాశకుపోతున్న యూట్యూబర్స్​ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో నిషేధం

ఈ బెట్టింగ్ యాప్​లు అన్నీ విదేశాల్లో నమోదు చేసుకున్నవే. మన దేశంలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌ను కట్టడిచేయడానికి సమగ్ర చట్టం లేదు. బ్రిటిష్​ కాలం నాటి పబ్లిక్‌‌‌‌ గ్యాంబ్లింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌-1867 దిక్కవుతోంది.  క్రీడా నైపుణ్యం లేకుండా కాసే పందెం మాత్రమే జూదం కిందకు వస్తుందని ఈ చట్టం చెబుతోంది. దీన్ని ఉపయోగించి బెట్టింగ్ యాప్​ సంస్థలు ఆన్​లైన్​ గేమ్స్ ముసుగులో మన దేశంలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు అయితే క్రికెట్ స్కోర్​, న్యూస్​ సైట్స్​గా ప్రచారం చేస్తూ దాంట్లో బెట్టింగ్​ చేస్తున్నాయి. క్రికెటర్లు, ప్రముఖ సెలబ్రిటీలతోనూ ప్రకటనలు ఇస్తున్నాయి. జూదం అనేది రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్​లో రాష్ట్ర జాబితాలో ఉంది. కాబట్టి జూదాన్ని అరికట్టేందుకు రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు ఆన్​లైన్​ బెట్టింగ్​పై నిషేధం విధించాయి. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అలాంటి నిషేధం లేదు. దీంతో మన రాష్ట్రాల్లో ఆన్​లైన్​ బెట్టింగ్ చేసేవాళ్లు వీపీఎన్​ ద్వారా ఇతర రాష్ట్రాల అడ్రస్​లతో ఆడుతున్నట్లు పలు కేసుల్లో వెలుగుచూసింది. దీనిపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. నిషేధం విధించడంతోనే సరిపోదు యూట్యూబ్​ఇతర సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్​ల ప్రకటనలపై చర్యలు తీసుకోవాలి. బెట్టింగ్ యాప్​ల ద్వారా ఆత్మహత్యలకు పాల్పడితే ఆ యాప్​ను ఎవరి ప్రోమో కోడ్​ ఉపయోగించి రిజిస్టర్ చేసుకున్నారో గుర్తించి ప్రమోట్ చేసిన సదరు ఇన్​ఫ్లుయెన్సర్​పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆన్​లైన్​ బెట్టింగ్​ యాప్​ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. 

విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్​లు

బెట్టింగ్ యాప్​లను యథేచ్ఛగా, విచ్చలవిడిగా ప్రమోట్​ చేస్తున్నారు. బెట్టింగ్​ సంస్థలు ఇచ్చే డమ్మీ యూజర్ అకౌంట్​ ద్వారా ఆ గేమ్స్ ఆడుతూ గెలిచి తాము సంపాదిస్తున్నట్లుగా చూపిస్తూ ఆశపెట్టి ఎలాగైనా ఈ యాప్​ను వినియోగించేలా చేస్తున్నారు. ప్రమోట్ చేసే యూట్యూబర్​ ప్రోమో కోడ్​తో యాప్​లో రిజిస్టర్ అయితే సదరు సంస్థ జాయినింగ్​ బోనస్ ఇచ్చి ఆకర్షిస్తోంది. ఈ యాప్స్‌‌‌‌  ఆడేవారికి  మొదట్లో కొంత సొమ్ము గెలుచుకునేలా చేస్తుంది. డబ్బులు వస్తున్నాయి కదా అని అలాగే ఆడుతూ నష్టపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఓ మోటో ట్రావెలర్ యూట్యూబర్ అయితే ఏకంగా టెలిగ్రామ్​లో ఓ గ్రూప్​ క్రియేట్​ చేసి బెట్టింగ్ యాప్​లను  ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి యాప్​ల ద్వారా అక్రమ పద్ధతుల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. మరో యూట్యూబర్ సేవ పేరుతో వీడియోలు చేస్తూ అందులోనూ బెట్టింగ్ యాప్​లను ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని ఫ్యాక్ట్స్ ఛానల్​లు కూడా ఇలాంటి యాప్​లను  ప్రచారం చేస్తున్నాయి. అనైతిక సంపాదనకు అలవాటుపడిన కొందరు యూట్యూబర్స్​ తమను అభిమానించి సబ్​స్ర్కైబ్​ ​చేసుకున్నవారిని ఇలా మోసం చేస్తున్నారు. యూట్యూబ్ తెరవగానే విచ్చలవిడిగా వస్తున్న ప్రకటనల వల్ల ప్రభావితం అవుతున్న పిల్లలు, యువకులు ఈ యాప్​లను వినియోగిస్తూ నష్టపోయి తనువు చాలిస్తున్నారు.  

- వంగరి రవిరాజు జర్నలిస్ట్​