భద్రాచలం, వెలుగు : భద్రాద్రి సీతారాములకు తొలి పూజలు చేసి అభినవ శబరిగా గుర్తింపు పొందిన పోకల దమ్మక్క సేవా యాత్ర భద్రాచలంలో ఆదివారం సంప్రదాయబద్ధంగా సాగింది. ప్రతీ ఏటా ఆషాఢ పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈవో రమాదేవి, వైదిక, పరిపాలనా సిబ్బంది, ఆదివాసీలు పోకల దమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి మూలవరుల వద్ద దమ్మక్క గోత్ర నామాలతో కేశవనామార్చన జరిగింది.
ఏజెన్సీలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు రామయ్యను దర్శించుకుని యాత్రలో పాల్గొన్నారు. ఆలయం నుంచి పోకల దమ్మక్క ఫొటోతో శోభాయాత్ర ప్రారంభించారు. తూము లక్ష్మీనర్సింహదాసు, భక్తరామదాసు, తానీషా తదితరులకు హారతులిచ్చి గిరిప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. తర్వాత భద్రాచలం నుంచి చర్ల మండలం ఆర్ కొత్తగూడెంలోని రామాలయానికి బయలుదేరారు.
అక్కడ గిరిజనులు ఈవో రమాదేవిని సంప్రదాయ రేలా నృత్యాలతో ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆదివాసీ కుటుంబసభ్యుల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి మూర్తులకు కల్యాణం నిర్వహించారు. గిరిజనులు తీసుకొచ్చిన అటవీఫలాలు, పూలతో సీతారామయ్యకు అర్చనలు, నివేదనలు జరిగాయి. ఆదివాసీలకు భద్రాచలం దేవస్థానం తరుపున సన్మానం జరిగింది.