బాలిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పంచనామా 

దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన బాలిక మృతదేహానికి  గాంధీ ఆస్పత్రిలో పంచనామా నిర్వహిస్తున్నారు. పంచనామా వివరాలను మొత్తం 4 పేజీల్లో వైద్యులు నమోదు చేస్తున్నారు. 4 పేజీల్లోని 22 కాలమ్స్ లో వివరాలను ప్రస్తావిస్తున్నారు. అనుమానాస్పద మరణంపై పంచనామా ప్రాసెస్ కు గంట సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముగ్గురు వైద్యుల బృందంతో పంచనామా పూర్తి చేయాలన్న నిబంధనను అనుసరిస్తున్నారు. 

మార్చురీ వద్ద ఉద్రిక్తత..

ఈనేపథ్యంలో గాంధీ మార్చురీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.  తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆందోళన నిర్వహించారు. బాలిక మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న మరికొంతమంది మహిళా కార్యకర్తలను అరెస్టు చేశారు. 

అదృశ్యమై.. చెరువులో శవంగా తేలి..

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా చెరువు వద్దకు వెళ్లగా.. చిన్నారి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. వెంటనే చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

శోకసంద్రంలో తల్లిదండ్రులు 

అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. డెడ్ బాడీని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కనీసం హాస్పిటల్లో సైతం తమ కూతురు మృతదేహాన్ని చూపించలేదని పేరెంట్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు.