- ముగిసిన రాకేశ్ అంత్యక్రియలు
- వరంగల్ నుంచి దబ్బీర్ పేట వరకు 50 కిలోమీటర్ల అంతిమయాత్ర
- ర్యాలీలో అడుగడుగునా ఉద్రిక్త పరిస్థితులు
- ప్రభుత్వ ఆస్తులపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడులు
- యాత్రకు రాకుండా రేవంత్ సహా కాంగ్రెస్ నేతల అరెస్టు
వరంగల్/ నర్సంపేట/వరంగల్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ ఘటనలో చనిపోయిన దామెర రాకేశ్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. స్వగ్రామం దబ్బీర్‌పేటలో రాకేశ్ చితికి తండ్రి కుమారస్వామి నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్ అంతిమ యాత్రలో పాల్గొని రాకేశ్ పాడే మోశారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని నివాళులర్పించారు. అంతకుముందు టీఆర్ఎస్ లీడర్ల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం నుంచి దబ్బీర్‌పేట వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ లో హైటెన్షన్ నెలకొంది. యాత్ర సజావుగా జరిగేలా చూడాల్సిన టీఆర్ఎస్ కార్యకర్తలే ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. టీఆర్‍ఎస్వీ నేతలు, ఎమ్మెల్యేల అనుచరులు వరంగల్ పోచమ్మ మైదాన్‍లోని బీఎస్‍ఎన్‍ఎల్ ఆఫీస్‍పై దాడి చేశారు. పోలీసులు, సెక్యూరిటీ అడ్డుకున్నా ఆగకుండా ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడి నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా టీఆర్‍ఎస్వీ లీడర్లు వినకపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన తమపై ఎలా చేయి వేస్తారంటూ పోలీసులతో టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాగా, బీఎస్‍ఎన్‍ఎల్ ఆఫీసుపై దాడికి పాల్పడిన ఘటనలో కార్పొరేటర్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు...
అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా సీనియర్ లీడర్లను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతిమయాత్ర వరంగల్ నుంచి నర్సంపేటకు చేరుకోగానే నివాళి అర్పించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని ఏసీపీ ఆఫీస్‍కు తరలించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. వారు పక్కనే ఉన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కార్యకర్తలు నర్సంపేట జంక్షన్‍లో ఎమ్మెల్యే సుదర్శన్‍రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. అయితే ఆమె వెళ్లిపోవాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు సైతం ఆమెను వెళ్లిపోవాలంటూ సిబ్బందితో పక్కకు తప్పించారు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్‌లో ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విడిచిపెట్టారు.
ఏడు గంటల పాటు యాత్ర
రాకేశ్ అంతిమ యాత్ర ఏడు గంటల పాటు సాగింది. డెడ్ బాడీని అధికారులు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి శనివారం ఉదయం ఉదయం10 గంటలకు మొదలైన యాత్ర పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామయ్య టాకీస్ మీదుగా నర్సంపేటకు చేరుకుంది. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాక దబ్బీర్ పేటకు చేరుకుంది. సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతిమయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.