తుంగతుర్తి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ‘దామన్న’ చిచ్చు

తుంగతుర్తి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ‘దామన్న’ చిచ్చు
  •     కాంగ్రెస్​ లీడర్లను ఎమ్మెల్యే పక్కన పెడుతున్నాడని దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం ఫైర్​  
  •     ఎమ్మెల్యే కొడుకులకు కౌంటర్‌‌‌‌‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చిన దామన్న కొడుకు
  •     త్వరలో ప్రజాదర్బార్‌‌‌‌‌‌‌‌ పెడ్తాడని ప్రకటించిన రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు: తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గానికి, సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే మందుల సామేలుకు మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్లను కాదని ఇటీవల పార్టీలో చేరిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లకు ఎమ్మెల్యే ప్రయార్టీ ఇస్తున్నాడని దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లోనే సామేలు వైఖరిలో మార్పు వచ్చిందని దామన్న వర్గం ఆరోపిస్తుండగా, ఎస్సీ రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తల దూర్చడం ఏందని సామేలు వర్గం ప్రశ్నిస్తోంది. కొంత కాలంగా ఇరువర్గాల మధ్య జరుగుతున్న పోరు ఇటీవల బహిర్గతమైంది. సామేలు ఎక్కడికి వెళ్లిన దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు. 

అర్వపల్లి మండలంలో ఇటీవల ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేపై ఏకంగా దాడికి పాల్పడ్డారని, దీంతో సామేలు కార్యక్రమంలో పాల్గొనకుండానే తప్పించుకుపోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఎమ్మెల్యే వర్గం చెప్తోంది. ఇక దామన్న వర్గం చేస్తున్న ఆరోపణలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన కొద్దిరోజులకే సామేలు ఎమ్మెల్యేగా గెలవడం వెనుక రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉందని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చులకు పైసలు లేకున్నా చందాలు వేసుకొని సామేలును గెలిపిస్తే ఇప్పుడు తమను దూరం పెడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారని అంటున్నారు.

సామేలు కొడుకులతోనే అసలు పంచాయితీ

సామేలు ఎమ్మెల్యేగా గెలవగానే ఆయన ఇద్దరు కొడుకులు తుంగతుర్తి రాజకీయాల్లో తల దూర్చడం పంచాయితీకి దారి తీసింది. ఇటీవల జరిగిన ఇసుక వ్యవహారంతో సహ, తహసీల్దార్లు, పోలీసులకు సామేలు కొడుకులు వార్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారని, దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మనుషులకు పనిచేయొద్దని, తాము గానీ, తమ నాన్న గానీ చెబితేనే చేయాలని హుకుం జారీ చేశారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వద్ద మొర పెట్టుకున్నారు. 

అయితే ఎమ్మెల్యే వ్యవహారంలో తాను తలదూర్చనని, ఏదున్నా హైకమాండ్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తే తప్ప సమస్యకు పరిష్కారం ఉండదని దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. దీంతో దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేందుకు మూకుమ్ముడి దాడికి సిద్ధమయ్యారు. దీనికి ధీటుగా ఎమ్మెల్యే సైతం తనను కాదని ఎవరైనా కార్యక్రమాలు చేపడితే వాటిని బైకాట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

ALSO Read : బీజేపీ నుంచి ఆరుగురు లీడర్ల సస్పెన్షన్
 

ఇటీవల నూతనకల్‌‌‌‌‌‌‌‌ మండలంలో జరిగిన బడిబాట కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరుకాగా ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అయితే ఎమ్మెల్యే సొంత గ్రామం అడ్డగూడూరు కేంద్రంగానే రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇటీవల పార్టీ నాయకుడు చనిపోతే ఎమ్మెల్యేకు చెప్పుకుండానే దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి రావడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నించడం గొడవలకు మరింత ఆజ్యం పోసింది. 

దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కొడుకు సర్వోత్తమ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎంట్రీ

మందుల సామేలు కొడుకులకు కౌంటర్‌‌‌‌‌‌‌‌గా సర్వోత్తమ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తానని బుధవారం తుంగతుర్తిలో దామోదర్‌ రెడ్డి ప్రకటించారు. అంతటితో ఆగకుండా తండ్రీకొడుకులిద్దరూ చావులకు, వేడుకులకు హాజరవుతున్నారు. ఏం కష్టమొచ్చినా తాము అండగా ఉన్నామని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇవ్వడం సామేలు వర్గానికి మింగుపడటం లేదు. వంగమర్తి ఇసుక పంచాయితీ కూడా ఈ గొడవలకు తోడైంది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఇచ్చిన పర్మిట్లతోనే ఇసుక రవాణా జరుగుతోంది. అసలు తాను ఎమ్మెల్యేగా గెలవగానే తట్టెడు ఇసుక కూడా తీసుకెళ్లనివ్వనని సామేలు శపథం చేశారు. 

కానీ గత ఆరు నెలల నుంచి ఇసుక రవాణా యథేచ్చగా సాగుతోంది. దీనిపైన సొంత పార్టీ నాయకులే వీడియోలు తీసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీనివెనక దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాత్ర ఉందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఇసుక రవాణాలో ఎమ్మెల్యే కొడుకుల పాత్ర ఉందని, వాళ్లను కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేయాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు గొడవకు దిగారు. దీంతో చివరకు ఇసుక రవాణా ఆపేయాలని ఎమ్మెల్యే ఆఫీసర్లను కోరారు.