నల్గొండ అర్బన్, వెలుగు: గ్రామీణ తపాలా ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి, కమలేష్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామోదర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 8 గంటల పని విధానం అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తుంటే అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘాల నేతలు ఆరకంటి యాదయ్య, సత్తయ్య, దామోదర్ రెడ్డి, రాజు, సబిత, సుచిత్ర, శారద, సునీత, సత్యం, హరీశ్, లక్ష్మీనరసయ్యపాల్గొన్నారు.
సూర్యాపేటలో ర్యాలీ
సూర్యాపేట, వెలుగు: గ్రామీణ తపాలా ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట పట్టణంలో ఏఐజీడీఎస్‌యూ, ఎన్‌యూజీడీఎస్‌యూ, ఎన్ఎఫ్‌పీఈజీడీఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హెడ్ పోస్టాఫీస్, ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సమ్మెలో పాల్గొన్న వారిని విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఉత్తర్వుల కాపీలను తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు నాగరాజు, రవి, మదన్, లింగయ్య, సంజీవ, మిధున్,వెంకటాచారి, పుల్లయ్య, తిరుపతయ్య, అఖిల, దివ్య, మేరి, రమ్యశ్రీ, చేతన నేషిన్ పాల్గొన్నారు.