పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం : దామోదర రాజ నర్సింహ

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం  
  • వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ 
  • కోదాడలో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
  • సిటీ ,  టిఫా స్కాన్‌‌ మెషీన్లు, ట్రామా కేర్ మంజూరు

కోదాడ, హుజూర్ నగర్, వెలుగు: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. బుధవారం ఇరిగేషన్‌‌, సివిల్ సప్లై, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కోదాడలో రూ. 26 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.

అంతకుముందు హుజూర్ నగర్ ఆస్పత్రిని పరిశీలించారు.  వార్డుల్లో  పేషెంట్లతో మాట్లాడి  వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుజూర్ నగర్, కోదాడ ఆస్పత్రులపై మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక పాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు 1800 వ్యాధుల చికిత్స కోసం రూ.487 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.  

రెండు నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది పని చేయాలని సూచించారు. పీహెచ్‌‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కావాల్సిన వసతులపై వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. 

మందులు అందుబాటులో ఉంచాలి

ఒక్క పేషంట్ కూడా బయట మందులు కొనవద్దని, అన్ని మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశించారు.  ఇటీవల స్టాఫ్ నర్సులను నియమించామని, త్వరలోనే వైద్యాధికారుల నియామకం చేపడుతామని చెప్పారు.  హుజూర్ నగర్, కోదాడ ఆస్పత్రులకు సిటీ స్కాన్, టిఫా అల్ట్రా స్కాన్‌‌ మెషీన్లతో పాటు కోదాడకు ట్రామా కేర్‌‌‌‌ కావాలని మంత్రి ఉత్తమ్ కోరగా.. ఆయన వెంటనే మంజూరు చేశారు.  

వారంలో ఈ వసతులు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ్ చొరవతో కోదాడలో వంద పడకల ఆస్పత్రితో పాటు రెండు నియోజకవర్గాల్లో ఇరిగేషన్‌‌ లిఫ్టులు మంజూరు అయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో  ఎమ్మెల్యే పద్మావతి, వైద్య ఆరోగ్య శాఖ  ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిష్టినా, కమిషనర్ అజయ్, డైరెక్టర్ ఆర్‌‌‌‌వీ కర్ణన్,  కలెక్టర్ వెంకట్‌‌రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్‌‌ కలెక్టర్లు సీహెచ్‌‌ ప్రియాంక, వెంకట్ రెడ్డి,  డీఎంహెచ్‌‌వో డాక్టర్ కోటాచలం, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన, ఏరియా ఆసుపత్రుల పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ కరుణ్ కుమార్, డాక్టర్ దశరథ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు,  నాయకులు లక్ష్మి నారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, పార సీతయ్య పాల్గొన్నారు.