- హోటళ్ల యజమానులతో మీటింగ్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ
- హైదరాబాద్ బిర్యానీకి ఉన్న బ్రాండ్ ఇమేజీని కాపాడాలి
- కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఆహారాన్ని కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ అసోసియేషన్, బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.
కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించడంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని వారికి మంత్రి సూచించారు. హైదరాబాద్ బిర్యానీకి, ఫుడ్డుకు ఓ బ్రాండ్ ఉందని, ఆ ఇమేజ్‌ను కాపాడాలన్నారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్ నిర్వహిస్తామని, అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ను ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతున్నామని, ఇందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డైరెక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.