విద్యా హక్కు చట్టంలాగే..వైద్య హక్కు చట్టం అవసరం : దామోదర రాజనరసింహ

విద్యా హక్కు చట్టంలాగే..వైద్య హక్కు చట్టం అవసరం : దామోదర రాజనరసింహ
  • కాంగ్రెస్ ​ప్రభుత్వంలో ​విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం

నిజామాబాద్/డిచ్​పల్లి, వెలుగు : చదువును తప్పనిసరి చేయడానికి విద్యా హక్కు చట్టాన్ని ఎలాగైతే తెచ్చామో.. సర్కార్​పక్షాన ఉచిత ట్రీట్​మెంట్​పొందే హక్కు చట్టాన్ని కూడా తేవాల్సిన అవసరముందని స్టేట్​ హెల్త్​మినిస్టర్​ దామోదర రాజనరసింహ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ​గవర్నమెంట్ ​విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నిజామాబాద్ ​రూరల్​ సెగ్మెంట్​లోని జక్రాన్​పల్లి మండల కేంద్రంలో గురువారం ఆయన గవర్నమెంట్​హైస్కూల్​ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2004లో కాంగ్రెస్​ గవర్నమెంట్​గొప్ప ఆలోచనతో రాజీవ్​ ఆరోగ్యశ్రీని ప్రారంభించింద ని, బీఆర్ఎస్ పాలకులు దానిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 

ఆ పథకాన్ని సమర్థంగా తీర్చిదిద్ది రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా మారుస్తామన్నారు. గవర్నమెంట్​బడులపై చులకన భావం తొలగేలా నాణ్యమైన విద్యను ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. స్కూల్స్​లో అన్ని రకాల సౌలతులు ఉండేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అవసరమని, లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో వీటి నిర్వహణ ఉండాలని మంత్రి సూచించారు. నిజామాబాద్​ జిల్లాకు తెలంగాణ వర్సిటీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు గొప్ప ఆలోచనలు, ప్రణాళికతో ముందుకెళ్లి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.

 తెలంగాణ స్టేట్​ఏర్పాటు ఆవశ్యకతను 2014లో తాము ఢిల్లీ పెద్దలకు చెప్పి ఒప్పించామని, కానీ.. తామే తెచ్చామని బీఆర్ఎస్​లీడర్లు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. డిచ్​పల్లికి మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్​ఏర్పాటు చేయాలని స్థానిక​ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోరగా మంత్రి అంగీకరించారు.  బంగారు తెలంగాణలో ఆర్మూర్​కు అంబులెన్స్​ లేదని అక్కడి ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి కామెంట్​చేయగా.. కాంగ్రెస్​ సర్కారు ​నుంచి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.   

సర్కార్​బడికి దాతల విరాళం రూ.3 కోట్లు

జక్రాన్​పల్లి మండలంలోని జడ్పీ హైస్కూల్​ బిల్డింగ్​నిర్మాణానికి గ్రామానికి చెందిన పైపుల రాజిరెడ్డి రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన కుటుంబీకులు ఇతర ప్రాంతాల్లో బిజినెస్​లో సెటిలైన వారు కలిసి రూ.3 కోట్ల విరాళం అందించారు. జక్రాన్​పల్లి మంత్రి అత్తగారి ఊరు కావడంతో.. విలేజ్​పెద్దల ఆహ్వానం మేరకు ఆయన వచ్చి ప్రారంభించారు.