
మునిపల్లి, వెలుగు: దసరాలోపు శంకుస్థాపన చేసిన అన్ని పనులను కంప్లీట్ చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంతోపాటు బుదేరా, కంకోల్, పెద్దచెల్మెడ, తాటిపల్లి, చీలపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. మునిపల్లి మోడల్ స్కూల్‌ను గతంలో తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభించానని, మరింత అభివృద్ధి చేసేందుకు రూ.85 లక్షల అదనపు నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బుదేరా జూనియర్, మహిళా డిగ్రీ కాలేజ్ లకు కేటాయించిన 20ఎకరాల స్థలాన్ని సర్వే చేయించి, బౌండరీలు ఫిక్స్ చేయాలని, అదనపు గదుల నిర్మాణం, కాంపౌండ్ వాల్, గేటు ఏర్పాటుకు, క్రీడా, మౌలిక సదుపాయాల అంచనా ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కంకోల్లో కొత్తగా నిర్మించే పీహెచ్సీ తో తన కల నెరవేరిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు పథకాలు అమలయ్యాయని, మిగతా వాటిని త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఈవో వెంకటేశ్వర్లు, టీఎస్ఈ డబ్లూఐడీసీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో గాయత్రి దేవి, తహసీల్దార్ తెన్మొళి, ఎంపీడీవో హరి నందన్ రావు పాల్గొన్నారు.