- సెల్‌ఫోన్లకు బానిసలై పుస్తకాలు చదవడం తగ్గిపోయింది
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మెదక్, వెలుగు : జీవన విలువలు నేర్పి, భవిష్యత్‌కు బాటలు వేసేవి పుస్తకాలేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసినిరెడ్డి సోమవారం పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం రాజనర్సింహ హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ సెల్‌ఫోన్లకు బానిసలుగా మారడంతో పుస్తకాలు చదవడం తగ్గిపోయిందన్నారు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం పెరుగుతుందన్నారు. రాచరిక వ్యవస్థ, నియంతృత్వ పాలనలో ప్రజల గొంతు నొక్కి, హక్కులను హరిస్తున్న క్రమంలో జనజాగృతి కోసం గ్రంథాలయాలు, జర్నలిస్ట్‌లు పోషించిన పాత్ర ఎంతో గొప్పదన్నారు.
సమాజంలో ప్రాధాన్యతలు, అవసరాలు, ఆలోచనా విధానాలు మారుతున్నాయన్నారు. ‘మనం’ అనే భావన పోయి ‘నేను’ అనే భావన పెరుగుతోందని, ఈ ధోరణి సమాజానికి ఎంతో ప్రమాదమన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీకృష్ణ పాల్గొన్నారు.