
టేక్మాల్, వెలుగు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం టేక్మాల్ మండలం ఎల్లంపేట గ్రామంలో పీహెచ్సీ, వివిధ గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టేక్మాల్ మండల కేంద్రంలో కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల ఆశ్రమ స్కూల్స్‌ను సందర్శించి స్టూడెంట్స్‌తో మాట్లాడారు.
కేజీబీవీ భవనం రిపేర్‌కోసం రూ.70 లక్షలు మంజూరు చేసి అదనంగా పాఠశాల అభివృద్ధికి రూ.1.50 కోట్లు మంజూరుకు సానుకూలంగా స్పందించారు. మోడల్ స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ .50 లక్షలు మంజూరు చేశామన్నారు. అలాగే అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్లే గ్రౌండ్ కు రూ.1.50 కోట్లు కేటాయింపులు చేస్తామన్నారు.
గిరిజన ఆశ్రమ స్కూల్లో స్టూడెంట్స్‌కు మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.35 లక్షల నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. కీలక రంగాలైన విద్యావైద్య రంగాలను విధ్వంసం చేసిందని ఆరోపించారు. టేక్మాల్ మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, లింక్ రోడ్లు, ప్రధాన రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో అంబదాసు రాజేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.