
రాయికోడ్, వెలుగు: వర్షాధార పంటలు సాగు చేస్తున్న భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందిస్తామని, నిర్వహణ బాధ్యత రైతులు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్, సింగితం, బొగ్గులంపల్లి, కర్చల్, యూసుఫ్ పూర్, ధర్మాపూర్, అల్లాపూర్, శంషోద్దీన్ పూర్, చిమ్నాపూర్ గ్రామాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్ల కింద తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు రూ.18 కోట్లతో బొగ్గులంపల్లి లిఫ్ట్ ను నిర్మించినట్లు పేర్కొన్నారు. దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ పంప్సెట్లు, ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బొగ్గులంపల్లి లిఫ్ట్ కోసం రూ.2.16 కోట్లతో పనులు చేసి నీరందిస్తున్నట్లు తెలిపారు.
మరో 3 కిలోమీటర్ల మేర కెనాల్, పైప్లైన్ ఏర్పాటుకు ప్రపోజల్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు పార్టీలకతీతంగా సొసైటీని ఏర్పాటు చేసుకొని ప్రాజెక్టును కాపాడుకోవాలని సూచించారు. అనంతరం మోడల్స్కూల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఆర్డీవో రాజు, ఎస్ఈ మురళీధర్, డీఎంహెచ్వో గాయత్రి, జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, ఎంపీపీ మమత, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఎంఎం షరీఫ్, కాంగ్రెస్ నాయకులు అంజయ్య, నర్సింలు, ప్రభాకర్,కేదార్నాథ్, శశికాంత్, మహంకాళి, సతీశ్ పాల్గొన్నారు.