![అనంత అతలాకుతలం... నీట మునిగిన కాలనీలు](https://static.v6velugu.com/uploads/2024/10/dana-cyclone-effect-in-anantapuram-district_RtBqXOncgi.jpg)
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం ( అక్టోబర్ 21) అర్ధరాత్రి నుంచి మంగళవారం( అక్టోబర్ 22) తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. దీంతో అనంతపురం నగర శివారు కాలనీలో పూర్తిగా నీట మునిగాయి. శ్రీ సత్య సాయి జిల్లాలో చిత్రావతి నదిలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
రెండున్నర దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా చిత్రావతిలో నీరు పారుతోంది. కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం నగరం సమీప కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 30 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున వరద రాలేదని స్థానికులు తెలిపారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందుతుంది. తిండి గింజలు కట్టుకున్న బట్టలు సైతం నీటిపాలయ్యాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడికి సమీపంలో ఉన్న కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. మునిగిన ప్రాంతాల్లో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించింది. రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు.. వంకలు.. చెరువులు.. కుంటలు ... పొంగి ప్రవహించడంతో కనగానపల్లి చెరువుకు గండి పడింది. పంట పొలాలు నీట మునిగి రైతులకు భారీ నష్టం జరిగింది. పండమేరు వాగు పొంగడంతో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
Also Read : ఏపీకి దానా తుఫాన్ ముప్పు
రామగిరి - N S గేట్, ముత్తవకుంట్ల-, కనగానపల్లి, తగరకుంట, -కనగానపల్లి, రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు ... పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు కాలనీలు మునిగిపోయాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. పెనుకొండ మండలం గట్టూరు జాతీయ రహదారిపై వర్షపు నీరు భారీగా ఉండటంతో... పలు వాహనాలు వరదముప్పులో చిక్కుకున్నాయి. దీంతో కియ ఎస్సై రాజేష్ తన సిబ్బందితో మునిగిన వాహనాలను బయటకు తీశారు.