- జీహెచ్ఎంసీ అధికారులపై దానకిశోర్ ఫైర్
- ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలని, చెత్తను తరలించాలని ఆదేశం
- ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు
- సంపుల నిర్మాణ పనుల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లపై ఏర్పడిన గుంతలను ఎప్పటికప్పుడు ఎందుకు పూడ్చడం లేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జీహెచ్ఎంసీ అధికారులపై ఫైర్అయ్యారు. శుక్రవారం ఆయన ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై సీరియస్అయ్యారు. మార్పు కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జర్నలిస్ట్ కాలనీ పాలపిట్ట సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై గుంతలు ఉండడాన్ని చూసి అధికారులపై మండిపడ్డారు.
చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేయాలని, అవసరమైన రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు. అదే ఏరియాలో వాటర్ లాగింగ్ పాయింట్ ను గుర్తించిన దానకిశోర్, వెంటనే సంపు నిర్మించేందుకు అనువైన ప్రాంతాన్ని చూడాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 45, రోడ్ నం70, గౌతంనగర్ బస్తీ, దీన్ దయాళ్ నగర్ బస్తీ, ఫిల్మ్ నగర్, పీఈటీ పార్కు ప్రాంతాల్లో తరచూ చెత్త వేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్ఎఫ్ఏలు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. గార్బేజ్ వర్నబుల్ పాయింట్లపై స్పెషల్ఫోకస్పెట్టాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. చెత్త ఎక్కువగా వస్తున్న ఏరియాల్లో రెండు షిఫ్టుల్లో సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న సంపుల పనులను దానకిశోర్ పరిశీలించారు. ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో రూ. 20 కోట్లతో మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీటిని సంపుల్లో సేకరించి.. సమీపంలోని నాలాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. సంపుల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు. దానకిశోర్వెంట జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఈఈ విజయ్ కుమార్, వాటర్బోర్డు జీఎం హరిశంకర్ తదితరులు ఉన్నారు.