ముషీరాబాద్/జూబ్లీహిల్స్, వెలుగు: రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ సికింద్రాబాద్ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కోరారు. గురువారం రాత్రి ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాంగ్రెస్సీనియర్నేతలు అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, అరవింద్ కుమార్ యాదవ్ తో కలిసి దానం నాగేందర్ పాల్గొని మాట్లాడారు. కులగణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని రాహుల్‌గాంధీ చెప్పారన్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ స్టేట్మెంట్ఇస్తే బీజేపీ సమాధానం ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. రెండు సార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి ఏనాడైనా పద్మశాలీల సమస్యలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రూ.కోట్లు తెచ్చామని చెబుతున్న కిషన్ రెడ్డి అంబర్‌పేట బ్రిడ్జిని ఎందుకు పూర్తిచేయలేకపోయారని నిలదీశారు.
తనను ఎంపీగా గెలిపిస్తే పద్మశాలీలకు అండగా ఉంటానని దానం చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గురువారం జూబ్లీహిల్స్నియోజకవర్గం రహ్మత్నగర్డివిజన్ ఎస్పీ ఆర్హిల్స్ నుంచి హెచ్‌ఎఫ్‌నగర్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దానం నాగేందర్, అజారుద్దీన్, నవీన్ యాదవ్, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.