ఫార్ములా ఈ రేసులో కేటీఆర్కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు: దానం నాగేందర్

ఫార్ములా  ఈ రేసులో అవినీతి జరగలేదని తాను ఎక్కడా  చెప్పలేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కేవలం రేస్ ఈవెంట్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని  మాత్రమే చెప్పానని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని.. ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. తాను కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. కొంత మంది మీడియా వాళ్లు తప్పుడు  ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏది మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుందన్నారు దానం. మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పది సంవత్సరాల పాలనలో రాష్ట్ర ఖజానా ఖాలీ అయ్యిందనీ.. అయినప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేస్తుందన్నారు.

హైడ్రా, మూసీ విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని అన్నారు. మూసి పై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే AC లు పెట్టించుకుని పడుకున్నారని విమర్శించారు. వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుండి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారని.. వీరికి ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. తాను ఫైటర్ నని.. ఉప ఎన్నికకు బయపడనని తెలిపారు. 

ALSO READ | విద్యాసాగర్ రావు మచ్చలేని మనిషి.. ‘ఉనిక’ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్


హైడ్రా పై ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడితే.. దానిని కొందరు మీడియా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 


హైడ్రా పై తన అభిప్రాయం ఇప్పుడు కూడా మారదని.. ప్రభుత్వం ఆలోచించి హైడ్రా పై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. మూసీకి అనుకుని హై కోర్టు..,  ఉస్మానియా లాంటివి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్నాయని లన్నారు. మూసీ ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.