- వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ కూచిపూడి, భరత నాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో దాదాపు ఏడు నెలలుగా ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారు. తన చిన్న వయసులో ఆమె కుటుంబం తమిళనాడుకు వలస వెళ్లింది.
తండ్రి ప్రోత్సాహంతో ఐదేండ్ల వయసులోనే చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరత నాట్యం శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. 1956లోనే తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తర్వాత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి వారి వద్ద కూచిపూడి అభ్యసించారు. ఎండీ రామనాథన్ దగ్గర కర్నాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ వద్ద వీణలో శిక్షణ పొందారు. గురుపంకజ్ చరణ్ దాస్, కేలూచరణ్ మహాపాత్రల వద్ద ఒడిస్సీలో ప్రావీణ్యం పొందారు.
ఉషా పరిణయంలో ఉషగా, శశిరేఖ పరిణయంలో శశిరేఖగా, క్షీరసాగర మథనంలో మోహినీగా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్థాన నర్తకిగా (రెసిడెంట్ డ్యాన్సర్) గౌరవం పొందారు.
పలు అవార్డులు సొంతం
యామినీ కృష్ణమూర్తిని అనేక అవార్డులు వరించాయి. కళా రంగానికి ఆమె చేసిన సేవలకు గాను 1968 లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భరతనాట్యంలో 1977 లో సంగీత నాటక అకాడమీ అవార్డులు దక్కాయి. తర్వాత పద్మభూషణ్ (2001), పద్మ విభూషణ్ (2016) పురస్కారాలు అందుకున్నారు. 1990లో ఆమె ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ను ప్రారంభించారు.
ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇక్కడ ఉంచనున్నారు. కాగా, ఆమె మరణంపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సంతాపం తెలిపారు. కాగా, యామినీ కృష్ణమూర్తి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.