దండకారణ్యం స్పెషల్‌‌ జోనల్‌‌ కమిటీ సభ్యుడు: మచ్చ సోమయ్య లొంగుబాటు

రేగొండ, వెలుగు: దండకారణ్యం స్పెషల్‌‌ జోనల్‌‌ కమిటీ సభ్యుడు మచ్చ సోమయ్య శనివారం భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌‌ ఖరే ఎదుట లొంగిపోయాడు. భూపాలపల్లి మండలం పంబాపూర్‌‌ గ్రామానికి చెందిన సోమయ్య 32 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు. 1990లో రైతు కూలీ సంఘంలో చేరిన ఆయనను 1992లో భూపాలపల్లిలో పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత 1993లో పెద్దిరెడ్డి అలియాస్‌‌ వెంకన్న నేతృత్వంలో మహదేవ్‌‌పూర్‌‌ ఏరియా కమిటీ సభ్యుడిగా చేరాడు. 1998లో మహదేవ్‌‌పూర్‌‌ ఏరియా కమిటి డిప్యూటీ కమాండర్‌‌గా పనిచేశాడు.

2003లో డివిజన్‌‌ కమిటీ మెంబర్‌‌గా పదోన్నతి పొందిన సోమయ్య 2007లో ఉత్తర తెలంగాణ స్పెషల్‌‌ జోనల్‌‌ కమిటీ నుంచి దండకారణ్య స్పెషల్‌‌ జోనల్‌‌ కమిటీకి బదిలీ అయ్యారు. ఇదే సంవత్సరంలో దండకారణ్య జనతన్‌‌ సర్కార్‌‌లో వ్యవసాయ విభాగం బాధ్యతలు తీసుకున్నాడు. పలు హింసాత్మక ఘటనల్లో కీలకంగా వ్యవహరించిన సోమయ్య, అనారోగ్యం కారణంగా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం ఆయనకు పునరావాస ప్యాకేజీ కింద రూ. 8 లక్షలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ ఎస్పీ బోనాల కిషన్‌‌, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌‌రావు, భూపాలపల్లి ఎస్సై సుధాకర్‌‌ పాల్గొన్నారు.

చత్తీస్‌‌గఢ్‌‌లో 9 మంది..
చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రం సుక్మా ఎస్పీ కిరణ్‌‌ చౌహాన్‌‌ ఎదుట శనివారం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా సుక్మా జిల్లాలో జరిగిన అనేక విధ్వంసాల్లో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన 9 మందిలో ఇద్దరిపై రూ.8 లక్షల చొప్పున, నలుగురిపై రూ.5 లక్షల చొప్పున, మిగిలిన ముగ్గురిపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద రూ. 25 వేల ఆర్థికసాయం అందజేశారు.