ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు

బజార్హత్నూర్/తిర్యాణి, వెలుగు : ఏజెన్సీ గ్రామాల్లో దండారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి బృందాలుగా చేరుకొని దండారి ఆడి.. ఆత్మీయత, ఐక్యత, సోదరభావాన్ని చాటారు. బజార్హత్నూర్ మండలంలోని చింతల్ సాంగ్వి గ్రామానికి చెందిన ఆదివాసీలు దీపావళి పండుగ సందర్భంగా బోథ్ మండలంలోని పార్డీ బీ గ్రామ ఆదివాసీలను ఆహ్వానించారు.

ఆదివాసీల ఆరాధ్య దైవం ఏత్మానూర్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, డప్పు వాయిద్యాల నడుమ గుస్సాడీ నృత్యంతో అలరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటేల్ భీమ్ రావు, దేవరి భూమన్న, ఆదివాసీ యూత్ అధ్యక్షుడు సిడం సుభాశ్, గ్రామ పెద్దలు, గ్రామ పటేల్, ఆదివాసీలు పాల్గొన్నారు. తిర్యాణి మండలంలోని ఇర్కాపల్లి, గడల్ పల్లి, కోలాంగూడ చెలిమెల గ్రామంలో గుస్సాడీ దండారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గుస్సాడీ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.