దండేపల్లిలో బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

దండేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉంటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దివాకర్​రావును నిలిదీశారు. దండేపల్లి మండల కేంద్రంలో బుధవారం అధికార బీఆరెస్ ఎమ్మెల్యే దివాకర్ రావు చీరలు పంపిణీ చేశారు. అయితే, ఆ చీరలను పరిశీలించిన మహిళలు.. ఎప్పట్లాగే ఈసారి కూడా నాసిరకంగా ఉన్నాయంటూ మండిపడ్డారు.

ఇలాంటివి పంపిణీ చేయడం ఎందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రూ.47 లక్షలతో నిర్మిస్తున్న మురుగు కాల్వ పనులను దివాకర్ రావు ప్రారంభించారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం తనను కొబ్బరికాయ కొట్టకుండా లక్షేట్టిపేట సీఐ కృష్ణ అడ్డుకున్నారని ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు.

దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీపీతోపాటు జడ్పీటీసీ నాగరాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమమైన చీరల పంపిణీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, పోలీసుల అండతో తమ గొంతు నొక్కుతూ బీఆరెస్ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ముగించారు.