- బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్
ఆర్మూర్, వెలుగు: మున్సిపల్ కార్మికులకు రావాల్సిన 8 నెలల పీఆర్సీ బకాయిలు, రెండు నెలల జీతాలు ఇచ్చేదాకా సమ్మె కొనసాగుతుందని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పేర్కొన్నారు. గురువారం ఆర్మూర్ లో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె ప్రారంభించారు. సమ్మెను ఉద్దేశించి దండి వెంకట్ మాట్లాడారు. బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరగా, మీ జీతాల కోసం నన్ను ఎక్కడైనా తాకట్టు పెట్టుకోండి అంటూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సరికాదన్నారు.
15 రోజుల కింద కలెక్టర్, లేబర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లకు సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించక పోవడంతోనే కార్మికులు సమ్మె కు వెళ్తున్నారన్నారు. బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్బ్యాగరి అశోక్, సెక్రటరీ రాజేశ్వర్, లీడర్లు రాజన్న, శ్రీనివాస్, ప్రసాద్, రేఖ పాల్గొన్నారు.