బద్నాం చేసేందుకే దండోరా: కాంగ్రెస్

ఎల్కతుర్తి, వెలుగు:  ఇంటి, నల్లా పన్నులు చెల్లించాలని కోరుతూ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ పంచాయతీ సిబ్బంది శుక్రవారం గ్రామంలో దగ్గరుండి దండోరా వేయించారు. ముఖ్యంగా పన్నులు కట్టని వారి ఇండ్లు, షాపుల ముందు డప్పు కొట్టించారు. ఈ విధంగా చేయడాన్ని గ్రామంలోని కాంగ్రెస్​నాయకులు తప్పుబట్టారు. వారితో స్వల్ప వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పాటైన రోజే ఇలా బద్నాం చేయడం కరెక్ట్​ కాదన్నారు. ఇన్నిరోజులు సైలెంట్​గా ఉండి, కొత్త ప్రభుత్వం రాగానే దండోరా వేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని, తమ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారిని పట్టించుకోకుండా పంచాయతీ సిబ్బంది దండోరాను కొనసాగించారు.