కామారెడ్డి/ కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రేమించి పెండ్లి చేసుకున్న తమ కుమారుడి జంటను విడదీసి ఆత్మహత్యకు కారకులైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బీబీపేట ఎస్సై సాయికుమార్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు శనివారం జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం..బీబీపేట మండలం జనగామకు చెందిన దండుగుల ప్రసాద్( 22), బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. నెల రోజుల కింద భద్రాచలం వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
ఎస్పీ కూడా రక్షణ కల్పించాలని బీబీపేట ఎస్సైని ఆదేశించారు. ఎస్సై వారికి కౌన్సెలింగ్ఇప్పించి పెద్దల సమక్షంలో మళ్లీ పెండ్లి చేస్తారని చెప్పి అమ్మాయిని వారి తల్లిదండ్రులకు వద్దకు పంపించారు. ఆ తర్వాత అమ్మాయి తరఫు వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోగా, యువతి మనస్సు మార్చుకుందని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ మార్చి 24న మెదక్ జిల్లా రామయంపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ప్రసాద్ చనిపోయారు. కుటుంబ సభ్యులు డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లాకు తీసుకొచ్చారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు. అక్కడకు వచ్చిన డీఎస్పీ సురేశ్ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.