సాగర్ ​లెఫ్ట్ ​కెనాల్‎కు డేంజర్ ​బెల్స్​.. ఆందోళనలో ఆయకట్టు రైతులు

  • వరుస ఘటనలతో ఆందోళనలో ఆయకట్టు రైతులు
  • 57 ఏండ్ల కింద ప్రారంభించిన కాలువలు
  • బలహీనంగా మారిన ఎడమ కాలువ, పెద్ద దేవులపల్లి రిజర్వాయర్లపై నిర్లక్ష్యం
  • గేట్ల రిపేర్లకు పైసా ఇవ్వని గత సర్కార్


నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​ఎడమ కాలువపై ప్రమాద ఘంటికలు మోగుతున్నా యి. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 57 ఏళ్ల క్రితం ప్రారంభించిన సాగర్​ ఎడమ కాలువ బలహీనంగా మారడంతో భారీ వరదలు వచ్చినప్పుడే కాకుండా సాగర్​ నుంచి కాలువలకు నీళ్లు వదిలినప్పుడు కూడా ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2022లో నిడమనూరు మండలం వేంపా డు, ముప్పారం వద్ద సాగర్​ఎడమ కాల్వ కట్ట తెగిపోవడంతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోవడంతో పాటు వరద నీరంతా గ్రామాల్లోకి ప్రవహించింది.

సాగర్ ప్రాజెక్టు​నుంచి పాలేరు రిజర్వాయర్​వరకు ఎడమ కాలువ 179 కిలోమీటర్ల పొడవు ఉండగా, మధ్యలో అనేక వాగులు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇవి ఉన్న దగ్గర ప్రధాన కాలువ అడుగు భాగంలో అండర్​ టన్నెల్స్(యూటీ) నిర్మించాల్సి ఉంది. దాంతో వరదలు వచ్చినప్పుడు ఆ నీరంతా యూటీల ద్వారా బయటకు వెళ్లి పోతుంది. తద్వారా ప్రధాన కాల్వ మీద వరద ప్రభావం ఉండదు. కానీ, ఎక్కడా యూటీల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో కాలువలోకి వచ్చే వరద నీరు అడుగు భాగం నుంచి బయటకు లీక్​ అవుతోంది. దీంతో ప్రధాన కాలువకు గండి పడడం, కట్ట పూర్తిగా తెగిపోవడం జరుగుతోంది. 

యూటీలు, లైనింగ్​ లేక ప్రమాదాలు..

ఎడమ కాల్వ నీటి సామర్ధ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. సాగర్ నుంచి నీళ్లు వదలినప్పుడు అనుకోకుండా వచ్చే వరద నీరు కాల్వలో ప్రవహించకుండా బయటకు వెళ్లేందుకు యూటీలు దోహదం చేస్తాయి. అండర్  టన్నెల్స్​లేకపోవడంతో వరదకు సాగర్​ నుంచి వచ్చే నీటి ప్రవాహం తోడవడంతో ఆ ఉధృతికి కాలువ కట్టలు తెగిపోతున్నాయి. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద జరిగిన ఘటనకు ఇదే కారణమని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెబుతున్నారు.

ఒకే రోజు 36 సెం.మీ వర్షం పడడంతో పాలేరు రిజర్వాయర్​లో ఒక్క రోజే 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 23 అడుగుల ఎత్తు ఉన్న పాలేరులోకి వరద నీరు చేరడంతో 31 అడుగులకు పెరిగింది. వరద నీరంతా ఎడమ కాల్వలోకి వెనక్కి తన్నడమే ప్రమాదానికి కారణమైంది. దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు సాగర్​నుంచి నీటి విడుదల బంద్​చేశారు. ఇదే క్రమంలో పెద్ద దేవులపల్లి రిజర్వాయర్​లోకి కూడా 3 వేల క్యూసెక్కుల వరద చేరింది. రెండు వైపులా వచ్చే వరద ప్రవాహాన్ని కంట్రోల్​చేసేందుకు అధికారులు రేయింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది.  

ఆధునికీకరణ పనుల్లోనే నిర్లక్ష్యం..

యూటీల నిర్మాణంతో పాటు కుడి, ఎడమ కాలువల లైనింగ్ పనులతో కలిపి రూ.4,444 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో 2008లో సాగర్​ ఆధునికీకరణ పనులు చేపట్టారు. కానీ, ఎక్కువగా కుడి కాలువ మీదే ఫోకస్​ పెట్టారు. ఎడమ కాల్వ మీద పనులు నామమాత్రంగానే చేశారు. యూటీలతో సహా సమస్యాత్మకంగా ఉందని భావించిన ఏరియాల్లో పనులు చేయకుండా అప్పటి కాంట్రాక్టర్లు మధ్యలోనే  వదిలేశారు.

పదేండ్లలో నయాపైసా ఖర్చు పెట్టలే..

గత పదేండ్లలో సాగర్​ఎడమ కాల్వ రిపేర్లు, డిస్ట్రిబ్యూటరీలు, లిఫ్ట్​ స్కీంల రిపేర్ల కోసం బీఆర్ఎస్  సర్కార్​ నయాపైసా ఖర్చు పెట్టలేదు. నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చే ఎడమ కాల్వపై 12 యూటీలు ఉన్నాయి. వీటికి రూ.30 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు. అలాగే పెద్ద దేవులపల్లి రిజర్వాయర్​ వద్ద మోటార్ల రిపేర్లకు రూ.2.50 కోట్లతో అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కానీ, నిధులు ఇవ్వకపోడంతో పనులు జరగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సర్కార్​ యూటీలు, లైనింగ్​పనులకు శాంక్షన్  

సూర్యాపేట జిల్లాలో టెండర్లు కంప్లీట్ కాగా, నల్గొండ జిల్లా ఫైల్​పరిశీలనలో ఉంది. ఇక పెద్దదేవులపల్లి మోటార్ల రిపేర్కు డబ్బులు రిలీజ్​ చేయాల్సి ఉంది. ఇప్పుడు సీజన్ కాకపోవడంతో పనులు వేసవిలో చేయడానికి వీలవుతుంది. కాల్వ కట్టలు బలహీనంగా ఉండడంతోనే సాగర్​ నుంచి నీటిని ఒకేసారి రిలీజ్​ చేయడం లేదు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాల మేరకు నీటి విడుదల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నామని 
ఆఫీసర్లు చెబుతున్నారు. 


పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‎దీ అదే పరిస్థితి..

పెద్దదేవులపల్లి రిజర్వాయర్‎కూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ రిజర్వాయర్​కు ఇరువైపులా ఉండే గేట్లను ఎత్తడానికి ఉపయోగించే మోటార్లు ఎప్పుడో మూలనపడ్డాయి. వీటి రిపేర్ల​ కోసం బీఆర్ఎస్ సర్కార్​ టెండర్లు పిలిచినా, నయాపైసా ఇవ్వలేదు. మోటార్ల రిపేర్​కు రూ.2.50 కోట్లు అవసరం ఉండగా, కాంట్రాక్టర్​కు పైసలు ఇవ్వకపోవడంతో అతడు చేతులెత్తేశాడు. పాలేరులో వచ్చిన వరద పెద్ద దేవులపల్లి మీద పడడంతో దాన్ని కంట్రోల్​చేయడానికి అధికారులు చివరకు కాంట్రాక్టర్​ను బతిమిలాడుకోవాల్సి 

రాత్రికి రాత్రి రెండు మోటార్లు తెప్పించి రిజర్వాయర్​గేట్లను కిందకు దింపడం వల్ల వరద కంట్రోల్ అయ్యింది. ఆరు గేట్లను రెండు మోటార్ల సాయంతో ఎత్తి వరద నీటిని అదుపు చేయగలిగారు. అదే మోటార్లు కండీషన్​లో ఉంటే గేట్లు ఎత్తడం, దించడం సులువుగా ఉండేదని ఆఫీసర్లు చెబుతున్నారు.