వరంగల్ బైపాస్ పై డేంజర్ బెల్స్

హనుమకొండ, వెలుగు:  వరంగల్ నగరంలో ట్రాఫిక్​ కష్టాలను దూరం చేసేందుకు ఎన్​ హెచ్​-163కి కొనసాగింపుగా నిర్మించిన బైపాస్(రింగ్​రోడ్డు)  డేంజర్ బెల్స్ ​మోగిస్తోంది. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాలకు వెళ్లే అప్రోచ్ ​రోడ్ల వద్ద సేఫ్టీ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రూ.కోట్లు ఖర్చు చేసి ఈ రింగ్ రోడ్డు నిర్మించిన ఆఫీసర్లు, గ్రామాల ఎంట్రన్సుల వద్ద సైన్​బోర్డ్స్​, జంక్షన్ల వద్ద లైటింగ్ సిస్టం మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటేనే జంకుతున్నారు. 

సిటీ చుట్టూ 17 కిలోమీటర్లు..

హైదరాబాద్ నుంచి వస్తున్న వెహికల్స్ పరకాల, భూపాలపల్లి, ములుగు, ఏటూరునాగారం తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదివరకు వరంగల్​ నగరం మధ్య నుంచి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయేది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ నిధులతో సిటీ చుట్టూ బైపాస్ నిర్మించారు. హైదరాబాద్ టు భూపాలపల్లికి వెళ్లే ఎన్​హెచ్ 163 కి అనుబంధంగా దీనిని కట్టారు. ఈ బైపాస్ సిటీ సరిహద్దు ​కరుణాపురం వద్ద ప్రారంభమై ఆరెపల్లి వద్ద ఎండ్ అవుతుంది. దాదాపు 17 కిలోమీటర్ల మేర 12 గ్రామాలను తాకుతూ ఈ బైపాస్ వెళ్తోంది. నిర్మాణంలో మాత్రం కాంట్రాక్టర్లు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రోజూ ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది.

రాత్రి వేళ అంధకారం..

కరుణాపురం నుంచి ఆరెపల్లి వరకు ఉన్న జంక్షన్ల వద్ద రాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జంక్షన్ల వద్ద సెంట్రల్ ​లైటింగ్​ సిస్టం లేక రోడ్లు అంధకారంగా కనిపిస్తున్నాయి. ఎన్​హెచ్​పై ఉన్న ఆర్​యూబీల వద్ద కూడా ఇదే సమస్య ఉంది. సర్వీస్​ రోడ్లు, ఆర్​యూబీలు  కలిసే చోట మిర్రర్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు.

లీడర్లు, ఆఫీసర్లకు రిక్వెస్ట్​లు

జంక్షన్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, సరైన లైటింగ్​ లేక ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్​హెచ్​ ఆఫీసర్లకు పలుమార్లు రిక్వెస్ట్​లు పెట్టారు. అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మిగతా చోట్ల బ్లాక్​ స్పాట్లను గుర్తించి తగిన విధంగా బోర్డులు, డివైడర్లు ఏర్పాటు చేస్తున్న పోలీసులు.. బైపాస్​  ను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  వంగపహాడ్​ జంక్షన్​ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో అక్కడ హసన్​ పర్తి పోలీసులు టెంపరరీ ప్లాస్టిక్​ డివైడర్స్​ఏర్పాటు చేశారు. కానీ లారీల రాకపోకల వల్ల అవి ఎప్పుడో ధ్వంసమయ్యాయి. ఆయా గ్రామాల వాట్సాప్​ గ్రూపుల్లో సెంట్రల్​ లైటింగ్ సిస్టం గురించి ఎంతోమంది రిక్వెస్ట్​లు పెడుతున్నారు. అధికారులకు కూడా వినతిపత్రాలు ఇస్తున్నారు. కానీ ఎన్​హెచ్​ఏఐ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. సదరు కాంట్రాక్ట్​ సంస్థ వర్క్స్​ మొత్తం కంప్లీట్ చేసిందని, కొత్తగా లైటింగ్​, బ్రేకర్స్​ ఏర్పాటు విషయంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. అప్రోచ్​ రోడ్ల వద్ద సరైన జాగ్రత్త చర్యలు చేపట్టి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

యాక్సిడెంట్లు అవుతున్నయ్​

రింగ్​ రోడ్డుపై దేవన్నపేట వద్ద జంక్షన్​ పై ఎలాంటి జాగ్రత్తలు చేపట్టలేదు. నైట్ టైం లో వెహికిల్స్​ కనిపించక యాక్సిడెంట్లు జరుగుతున్నయ్​. ఇదే విషయమై ఎన్​హెచ్​ ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశాం. ప్రమాదాల నివారణకు లీడర్లు, ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలి.

- ఆరెల్లి సురేశ్​, దేవన్నపేట

రోడ్డు దాటాలంటే భయమేస్తోంది

ఎన్​హెచ్​-163 పై జంక్షన్ల వద్ద ఎలాంటి లైటింగ్​ ఉండటం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో అవతలి వైపు నుంచి వచ్చే వెహికిల్స్​ ఏర్పడక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు జంక్షన్ల వద్ద లైటింగ్​ సిస్టం ఏర్పాటు చేయడంతో పాటు ఆర్​యూబీల వద్ద మిర్రర్స్​ ఏర్పాటు చేయాలి.

- మామిడాల దేవేందర్​ రెడ్డి, ధర్మసాగర్