- రాష్ట్రంలో కరోనాపై ఐసీఎంఆర్,
- సీసీఎంబీ, ఎన్‌ఐఎన్ అంచనా
- జూన్‌లో కేసులు తగ్గుముఖం పట్టే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకో నెల రోజుల్లో పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. దేశంలో ఈ నెల మూడో వారంలోనే పీక్ స్టేజ్‌కు రావొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గత అనుభవాలను బేరీజు వేసుకుని ఐసీఎంఆర్, సీసీఎంబీ, ఎన్‌ఐఎన్ సైంటిస్టులు ఈ విషయాన్ని అంచనా వేశారు. మన దగ్గర ఇంకో 3 వారాలు కేసులు ఇట్లనే పెరుగుతాయని, మే రెండో వారంలో పీక్ నమోదవుతుందని అన్నారు. ఆ తర్వాత ఒకట్రెండు వారాలు అదే ట్రెండ్ కొనసాగి, క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. గతేడాది మన దేశంలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన వంద నుంచి 120 రోజుల మధ్య కరోనా పీక్ స్టేజ్‌కు వచ్చింది. ఇప్పటి పరిస్థితుల ప్రకారం 50 నుంచి 60 రోజుల మధ్యలోనే పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అన్నీ ఓపెన్ ఉండడం, జనాలు జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. దేశంలో ఫిబ్రవరి నెలాఖరులో, మార్చి మొదట్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమవగా, మన రాష్ట్రంలో మాత్రం మార్చి నెల మధ్య నుంచి కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. సైంటిస్టులు చెప్తున్న 50 నుంచి 60 రోజుల పీక్ స్టేజ్ లెక్క ప్రకారం చూస్తే దేశంలో ఏప్రిల్ మూడో వారంలో పీక్ స్టేజ్ నమోదై, మే చివరి నాటికి సాధారణ పరిస్థితులు వస్తాయి. అదే మన రాష్ట్రంలో మే రెండో వారంలో పీక్ స్టేజ్ నమోదై, జూన్‌లో సాధారణ స్థితి నెలకొంటుంది.
ఇంకో 3 వారాలు
మన రాష్ట్రంలో, దేశంలో పరిస్థితులపై సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా ‘వెలుగు’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్త వేరియంట్ల వల్లే వైరస్ వేగంగా వ్యాపిస్తోందనడానికి ఆధారాలు లేవని చెప్పారు. తమ స్టడీ ప్రకారం ఐదు శాతం కేసులకే కొత్త వేరియంట్లు కారణమని పేర్కొన్నారు. వైరస్ ఎన్నిసార్లు మ్యుటేట్ అయినా, ఎన్ని కొత్త వేరియంట్లు వచ్చినా దాని స్పీడ్ అసాధారణంగా ఏమీ ఉండదన్నారు. మ్యుటేషన్లు, వేరియంట్లపై తమ స్టడీ పూర్తి ఫలితాలు ఇంకో 15 రోజుల్లో వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే వచ్చే నెల మొదటి వారంలో కరోనా పీక్ స్టేజ్‌కు రావొచ్చని ఆయన అన్నారు. రాబోయే మూడు వారాలు విపరీతంగా కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. పీక్ తర్వాత తగ్గే చాన్స్ ఉన్నప్పటికీ, ఎప్పుడు ఎండ్ అవుతుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రజలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే టైమ్ పీరియడ్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఇంతలా ఉండడానికి ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం, ప్రభుత్వ నామమాత్రపు చర్యలే కారణమన్నారు.
పల్లెల్లో ఆలస్యంగా పీక్ స్టేజ్
తమ అంచనా ప్రకారం సెకండ్ వేవ్ ఇంకో 2 నెలలు మాత్రమే ఉంటుందని ఎన్‌ఐఎన్ సీనియర్ సైంటిస్ట్, పబ్లిక్ హెల్త్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య అన్నారు. రీ ఇన్‌ఫెక్షన్ చాలా తక్కువగా ఉందని, ఇదివరకు వైరస్ బారినపడని వాళ్లే ఇప్పుడు బాధితులుగా మారుతున్నారని ఆయన చెప్పారు. ‘వెలుగు’తో లక్ష్మయ్య తన అభిప్రాయాలను పంచుకున్నారు. డిసెంబర్‌లో చేసిన సీరో సర్వే ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో అప్పటికే 54 శాతం మందికి యాంటీబాడీస్ వచ్చాయని, సెకండ్ వేవ్, వ్యాక్సినేషన్‌తో ఇంకో నాలుగైదు వారాల్లో ఇది 60 నుంచి 70 శాతానికి చేరొచ్చని పేర్కొన్నారు. అప్పటికి హెర్డ్ ఇమ్యునిటీ వచ్చి వైరస్ వ్యాప్తి తగ్గే చాన్స్ ఉందన్నారు. రూరల్‌లో మాత్రం జూన్ వరకూ సెకండ్ వేవ్ కొనసాగవచ్చని అంచనా వేశారు. సీరో సర్వే ప్రకారం ఊళ్లలో 25 నుంచి 30 శాతం మందిలోనే యాంటిబాడీస్ ఉన్నాయని, ఇంకో 70 నుంచి 75 శాతం మందికి వైరస్ సోకే ముప్పు ఉందన్నారు. అందుకే సిటీలో కొంత త్వరగా, పల్లెల్లో ఆలస్యంగా కరోనా పీక్ స్టేజ్‌కు వచ్చే చాన్స్ ఉందని లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే గ్రేటర్ హైదరాబాద్‌లో మే మధ్యలోనే పీక్‌కు వెళ్లేలా ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాల్లో జూన్‌లో పీక్ స్టేజ్ రావొచ్చని
అభిప్రాయపడ్డారు.
స్పీడ్‌గా తగ్గుతుంది
దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ఐఐటీ ఖరగ్‌పూర్ ఇటీవల ఒక స్టడీ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఈ స్టడీ ప్రకారం దేశంలో ఈ నెల 15 నుంచి 20 మధ్యలో పీక్ స్టేజ్ వస్తుంది. అంటే, అప్పటివరకూ విపరీతంగా కేసులు నమోదై, ఆ తర్వాత తగ్గడం ప్రారంభమవుతుంది. కేసులు ఎంత వేగంగా పెరిగాయో, అంతే వేగంగా తగ్గుతాయని స్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. పీక్ స్టేజ్ వచ్చాక నెల రోజుల్లోనే కేసుల సంఖ్య భారీగా పడిపోయే చాన్స్ ఉందని వివరించారు. మే చివరి నాటికే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేశారు.
పల్లెల్లో కేసులు పెరుగుతయ్
డిసెంబర్‌లో చేసిన సీరో సర్వే ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 54 శాతం మందికి యాంటీబాడీస్ వచ్చాయి. ఊళ్లలో 25 నుంచి 30 శాతం మందిలోనే యాంటిబాడీస్ ఉన్నాయి. అక్కడ ఇంకో 70 నుంచి 75 శాతం మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. సిటీలో మే చివరి వరకు, పల్లెల్లో జూన్ వరకూ సెకండ్ వేవ్ కొనసాగొచ్చు.
‑ డాక్టర్ లక్ష్మయ్య, ఎన్‌ఐఎన్ సీనియర్ సైంటిస్ట్, పబ్లిక్ హెల్త్ ఎపిడమాలజిస్ట్
వ్యాప్తి తగ్గినా.. ఎండ్ ఎప్పుడో చెప్పలేం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంతలా ఉండడానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రభుత్వం నామమాత్రపు చర్యలే కారణం. పీక్ స్టేజ్ తర్వాత కరోనా వ్యాప్తి తగ్గే చాన్స్ ఉన్నప్పటికీ, ఎప్పుడు ఎండ్ అవుతుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. ప్రజలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే టైమ్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది.
‑ డాక్టర్ రాకేశ్‌మిశ్రా, సీసీఎంబీ డైరెక్టర్