
- కరోనా ట్రీట్‌మెంట్‌లో పెరిగిన వాడకం
- అనవసరంగా వాడితే ప్రాణాలకే ముప్పంటున్న ఎక్స్పర్ట్స్
- షుగర్ లెవల్స్ బాగా పెరిగి కిడ్నీలు ఖరాబయ్యే ప్రమాదం
- బ్లాక్ ఫంగస్ కేసులకూ ఇదే రీజన్!
- రాష్ట్రంలో ఐసోలేషన్ కిట్‌లోనే స్టెరాయిడ్స్ పంపిణీ
హైదరాబాద్, వెలుగు: ఆర్‌ఎంపీ నుంచి కార్పొరేట్ హాస్పిటళ్లలో పెద్ద డాక్టర్ల వరకూ ఇప్పుడు కరోనా ట్రీట్‌మెంట్‌లో వాడుతున్నవి స్టెరాయిడ్స్. అయితే.. వీటిని అతిగా, అనవసరంగా వినియోగించడంతో పేషెంట్ల కండీషన్ సీరియస్ అవుతోంది. చాలా మందికి షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. ఆ ఎఫెక్ట్‌తో కిడ్నీలు ఖరాబైతున్నాయి. ఇమ్యూనిటీ లెవల్స్ పూర్తిగా పడిపోతున్నాయి. మ్యూకర్ మైకోసిస్ వంటి ఫంగల్ వ్యాధులు దాడి చేసినప్పుడు శరీరం తట్టుకోలేని స్థితికి చేరుకుంటున్నది. పైగా థైరాయిడ్, ఆర్థరైటీస్ వంటి అనేక జబ్బులు చుట్టుముడుతున్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాక నాలుగైదు రోజులకో, నాలుగైదు వారాలకో ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇలాంటి సమస్యలతో వందల మంది మళ్లీ హాస్పిటళ్ల బాట పడుతున్నారు. అనేక మంది పరిస్థితి క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా నిజమే అయినప్పటికీ కరోనా నుంచి బయటపడేసేందుకు స్టెరాయిడ్స్ తప్ప మరో మార్గం లేదని, అయితే వాడే విధానం సరిగ్గా లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కూడా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) కేసులు పెరగడం వెనుక స్టెరాయిడ్స్ మిస్ యూజ్ ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో స్టెరాయిడ్స్ వాడకం ఎక్కువగా ఉంటోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.
ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికించింది. అమెరికా, యూకే సహా చాలా దేశాల్లో కోట్ల మందికి సోకింది. కానీ, ఆయా దేశాల్లో పెద్దగా కనిపించని బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) కేసులు మన దేశంలో విపరీతంగా నమోదవుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రోజూ వందకు పైగా కేసులు వస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఈ స్థాయిలో బ్లాక్ ఫంగస్ కేసులు రావడానికి కారణం కరోనా బాధితుల్లో ఇమ్యూనిటీ లెవల్స్ పడిపోవడం, షుగర్స్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోవడమేనని అంటున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితుల్లో 99 శాతం మంది కరోనా బారి నుంచి బయటపడడానికి స్టెరాయిడ్స్ వాడినవాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. అయితే, షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోవడానికి స్టెరాయిడ్స్‌తో పాటు మరో కారణం కూడా ఉందని అంటున్నారు. మన పాంక్రియాస్లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలు ఉంటాయి. వైరస్ ఈ కణాల్లోకి చొరబడి, వాటిని నాశనం చేస్తోంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, లేదా ఆగిపోవడం జరుగుతోందని డాక్టర్లు అంటున్నారు. మన రక్తంలోని చక్కెరను ఇన్సులిన్ గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇన్సులిన్ లేకపోవడంతో బ్లడ్‌లో చక్కెర లెవల్స్ పేరుకుపోతున్నాయి. షుగర్ ఉన్నవాళ్లలో సహజంగానే ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఇందుకు తోడు స్టెరాయిడ్స్ వాడకంతో ఇమ్యూనిటీ లెవల్స్ జీరోకు పడిపోతున్నాయి.
సర్కారు కిట్స్‌లోనూ ఇస్తున్నరు
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో మన ఇమ్యూనిటీ సిస్టం ఓవర్‌గా రియాక్ట్ (ఇన్‌ఫ్లమేటరీ) అవుతుంది. ఈ ఇన్‌ఫ్లమేటరీ కండీషన్‌లో, ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నవాళ్లలో మాత్రమే స్టెరాయిడ్స్ వాడాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎయిమ్స్, సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ గైడ్‌లైన్స్‌లోనూ అసింప్టమాటిక్, మైల్డ్ సింప్టమాటిక్ కేసుల్లో స్టెరాయిడ్స్ వాడొద్దని స్పష్టంగా పేర్కొన్నారు. మన రాష్ట్ర సర్కార్ మాత్రం ఈ గైడ్‌లైన్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి హోమ్ ఐసోలేషన్ కిట్‌లోనే స్టెరాయిడ్స్ పంపిణీ చేస్తోంది. ‘‘ఐదు రోజులు నార్మల్ మెడిసిన్ వాడండి, అప్పటికీ సింప్టమ్స్ తగ్గకపోతే స్టెరాయిడ్స్ వాడండి’’ అని కిట్‌లో ఉన్న పేపర్‌లో రాసి పెడుతున్నారు. కరోనా బాధితుల్లో ఐదు రోజుల తర్వాత కూడా ఏదో ఒక సింప్టమ్స్ కంటిన్యూ అవుతోంది. దీంతో బాధితులు స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. ఇంకొంత మంది కరోనా వచ్చిన వెంటనే డెక్సామిథాజోన్, మిథైల్ ప్రెడ్నిసొలోన్ వంటి స్టెరాయిడ్స్ వాడకం స్టార్ట్ చేస్తున్నారు. ఆర్‌ఎంపీలు కూడా కరోనా వచ్చినోళ్లకు స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు. ఇలా ఎర్లీ స్టేజ్‌లో స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పడిపోయి, కరోనా వైరస్ లోడ్ పెరగుతుంది. దీంతో అప్పటివరకూ నార్మల్‌గా ఉన్నవాళ్లు కూడా సీరియస్ కండీషన్‌లోకి పోయే ప్రమాదం ఉంది. కానీ, మన సర్కార్ ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని డాక్టర్లు అంటున్నారు.
డిశ్చార్జ్ అయినంక తిరగబడింది
హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్ ఈ నెల 6న కరోనా ట్రీట్‌మెంట్ కోసం గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈ నెల 12న సాయంత్రం డాక్టర్లు అతడ్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత రెండు రోజులకే శ్రీనివాస్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇంటి దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి టెస్టులు చేపిస్తే, ఆయన షుగర్ లెవల్స్ నాలుగొందలకు పైగా ఉన్నాయని, క్రియాటిన్ విపరీతంగా పెరిగిందని అక్కడి డాక్టర్లు చెప్పారు. ఆ మరుసటి రోజు ఉదయమే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస్‌కు అంతకుముందు షుగర్ లేదని, కిడ్నీ ప్రాబ్లమ్ కూడా లేదని ఆయన భార్య ‘వెలుగు’తో అన్నారు. కరోనా ఎఫెక్ట్, స్టెరాయిడ్స్ వాడకం వల్లే శ్రీనివాస్‌కు షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగి, కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు.
కరోనా వచ్చిన వెంటనే వేసుకోవద్దు
స్టెరాయిడ్స్‌తో బెనిఫిట్ ఉన్నా.. వాటిని ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో తెలుసుకోవాలి. కరోనా వచ్చిన వెంటనే స్టెరాయిడ్స్ వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. స్టెరాయిడ్స్ వాడని వాళ్లతో పోలిస్తే ఎర్లీ స్టేజ్‌లో స్టెరాయిడ్స్ వాడుతున్నవాళ్లలో మరణాల రేట్ ఎక్కువగా ఉంది. మోడరేట్, సీవియర్ కేసుల్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతున్నప్పుడు స్టెరాయిడ్స్ తో ఉపయోగం ఉంటుంది.
- డాక్టర్ రణదీప్ గులేరియా, డైరెక్టర్, ఎయిమ్స్
సడన్‌గా ఆపొద్దు
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక చాలా మంది స్టెరాయిడ్స్ సడెన్‌గా ఆపేస్తున్నారు. దీని వల్ల కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ ఆగిపోయింది. ఎలక్ట్రో ఇంబ్యాలెన్స్ ఏర్పడి మనిషి నీరసించి సడెన్‌గా కొలాప్స్ అవుతారు.
- డాక్టర్ అమిత్ గోయల్, ఎండోక్రైనాలజిస్ట్, ఈఎస్‌ఐ సనత్‌నగర్
వాడకం పెరిగింది
సెకండ్ వేవ్‌లో స్టెరాయిడ్స్ వాడకం పెరిగింది. హాస్పిటళ్లకు రావడానికి ముందే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఆక్సిజన్ తగ్గుతున్నప్పుడు లేదా సీరియస్ కండీషన్‌లోనే హాస్పిటళ్లకు వస్తున్నారు. ఆ స్టేజ్‌లో స్టెరాయిడ్స్ ఇవ్వక తప్పడం లేదు. డెక్సామిథాజోల్, మిథైల్‌ప్రెడ్నసోలోన్, టొసిలిజుమాబ్ వంటివి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ఇమ్యూనిటీ సిస్టం ఓవర్‌గా రియాక్ట్ అయి సైటోకైన్ స్టార్మ్ ఏర్పడుతుంది. ఈ స్టార్మ్‌ను కంట్రోల్ చేసేందుకు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దీంతో ఇమ్యూనిటీ తగ్గడం, షుగర్ లెవల్స్ పెరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.
- డాక్టర్ కిరణ్ మాదాల, నిజామాబాద్ జీజీహెచ్
బ్లాక్ ఫంగస్ బాధితుల్లో పోస్ట్ కొవిడ్ వాళ్లే ఎక్కువ
హైదరాబాద్‌లోని ఒక్కో కార్పొరేట్ హాస్పిటల్‌కు రోజూ 3 లేదా 4 బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయి. ఇందులో ఎక్కువ మంది పోస్ట్ కొవిడ్ వాళ్లే. స్టెరాయిడ్స్‌తో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగి ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్పాండ్ అవడం లేదు. దీంతో రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎటాక్ చేస్తున్నాయి. అందులో బ్లాక్ ఫంగస్ చాలా డేంజర్. ఆలస్యం చేస్తే ప్రాణాలు కాపాడలేం. ఏ చిన్న సింప్టమ్ కనిపించినా హాస్పిటల్‌కు వెళ్లాలి.
‑ డా. సంపూర్ణ ఘోష్, ఈఎన్‌టీ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్
హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నరు?
- షుగర్ వ్యాధితో బాధపడుతున్నవాళ్లు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. షుగర్ లెవల్స్ పెరిగిపోయి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.
- అతిగా, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా శరీరం తట్టుకోలేదు.
- కరోనా లక్షణాలు బయటపడ్డ / పాజిటివ్ వచ్చిన వెంటనే స్టెరాయిడ్స్ వాడొద్దు.
- మైల్డ్ సింప్టమ్స్ ఉన్నవారికి స్టెరాయిడ్స్ అవసరమే లేదు.
- మోడరేట్, సివియర్ సింప్టమ్స్ ఉన్నవారికి, ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నవారికి డాక్టర్ల సూచన మేరకు, సూచించిన డోసేజ్‌లో మాత్రమే స్టెరాయిడ్స్ వాడాలి.
- కరోనా వచ్చిన తర్వాత ఇతర మెడిసిన్స్ వాడినా జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకపోతే డాక్టర్‌ను కలవాలి.