మోదీతో రాజ్యాంగానికి ప్రమాదం : నారాయణ

హనుమకొండ, వెలుగు: ప్రధాని మోదీతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ, జ్యుడీషియరీ లాంటి వ్యవస్థలను మోదీ తన గుప్పిట్లో పెట్టుకొని.. తన మాట వినని ఇతర పార్టీల నాయకులను జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా.. సోమవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్​ హాల్లో సీపీఐ వరంగల్ పార్లమెంట్​ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి నారాయణతో పాటు  పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. నారాయణ మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఆర్థిక నేరగాళ్లు పెరిగిపోయారన్నారు. తన భార్య మంగళ సూత్రాలను గౌరవించని మోదీకి.. కాంగ్రెస్ వస్తే మంగళ సూత్రాలు మిగలవని మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. మోదీతో చీకటి దోస్తీ చేస్తూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లే  కేసీఆర్ ఓడిపోయారని, కమ్యూనిస్టులను దూరం పెట్టి ప్రజలకు దూరమయ్యారని అన్నారు.   

బీజేపీకి ఓటేస్తే ఆత్మహత్యా సదృశ్యమే: కూనంనేని

ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.  మోదీకి అధికార దాహం ఎక్కువగా ఉంటుందని, పదవి కోసం దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేందుకు  వెనుకాడటం లేదన్నారు. సోనియా, రాహుల్ కు ప్రధానిగా అవకాశం వచ్చినా దేశం కోసం వదులుకున్నారని గుర్తుచేశారు. విశ్వాస ఘాతుకానికి కేసీఆర్ నిదర్శనని విమర్శించారు.