- ప్రమాదకరంగా తిరుమలగిరి మూల మలుపు రోడ్డు
- ఎలివేటెడ్ కారిడార్ కు నిర్మాణానికి ముందే మార్పులు చేయండి
- అధికారులు పట్టించుకోకపోగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన స్థానికులు
- కారిడార్అలైన్మెంట్ మార్చలేమంటున్న హెచ్ఎండీఏ అధికారులు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్– తిరుమలగిరి క్రాస్‌రోడ్డులోని మూల మలుపు ప్రమాదాలకు కేరాఫ్ గా ఉంది. కొన్నేండ్లుగా ఎంతో మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడగా.. ప్రాణాలు కోల్పోయినవారు, గాయపడ్డ వారు ఉన్నారు. ఇంజినీరింగ్ డిజైన్‌లోపం కారణంగా యాక్సిడెంట్స్ జోన్ గా మారింది. సికింద్రాబాద్‌నుంచి అల్వాల్వెళ్లే రూట్ లో తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్‌నుంచి మూల మలుపు మొదలై 500 మీటర్ల మేర కంటోన్మెంట్ లోని డంప్ యార్డ్ వద్ద ముగుస్తుంది. దీంతో ముందు, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, స్థానికులు భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది.
తిరుమల గిరి క్రాస్‌రోడ్డులో నాలుగువైపుల నుంచి వాహనాలు వస్తుండగా రాత్రిపూట సరిగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికలు, వాహనదారులు చెబుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా చివరకు సర్వేలు చేశారని, ఇంజనీరింగ్ప్లాన్లో జరిగిన తప్పుగా తేల్చారే కానీ.. దానిని మార్పు చేయలేదని స్థానికులు తెలిపారు. ఎనిమిదేండ్ల కిందట డివైడర్ఏర్పాటు చేయగా.. పరిస్థితిని స్వల్పంగా మెరుగు పరిచినా శాశ్వత పరిష్కారం చూపలేదు. ఇప్పటికైనా ప్యారడైజ్–--షామీర్పేట్వరకు చేపట్టబోయే ఎలివేటెడ్కారిడార్ నిర్మాణానికి ముందే మూల మలుపు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు సమస్యపై అధికారులకు పదే పదే ఫ్లాగ్ చేసినా పట్టించుకోవడంలేదు. దీంతో చివరకు ముఖ్యమంత్రికి లేఖ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెప్పారు. మూల మలుపుతో జరిగే ప్రమాదాలపై కంటోన్మెంట్అధికారులు కూడా స్పందించడం లేదని తిరుమలగిరికి చెందిన రవీందర్ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్ తరాలకు ప్రమాదాలు లేకుండా.. మూల మలుపును తొలగించి సరిగా రోడ్డును, ఎలివేటెడ్కారిడార్ నిర్మాణం చేపడితే చాలా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ అధికారులు మాత్రం ప్లాన్‌లో మార్పులు చేయలేమంటున్నారు. ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్‌ను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించిందని, ప్రస్తుతం ప్లాన్ మేరకే నిర్మాణం జరుగుతుందని, అలైన్మెంట్ మార్పుపై ఏం చేయలేమంటున్నారు.