సుంకాలతో డేంజరే! ఇండియా ఎక్కువ టారిఫ్లు విధించే రంగాలకు మరింత నష్టం

సుంకాలతో డేంజరే! ఇండియా ఎక్కువ టారిఫ్లు విధించే రంగాలకు మరింత నష్టం

న్యూఢిల్లీ: అమెరికా మనదేశ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధిస్తే చాలా రంగాలు నష్టపోతాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ముఖ్యంగా సుంకాల మధ్య భారీ తేడా ఉన్న రంగాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. అంటే అమెరికా కంటే ఇండియా వసూలు చేసే సుంకాలు ఎక్కువగా ఉన్న రంగాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 

వ్యవసాయం, విలువైన రాళ్ళు, రసాయనాలు, ఫార్మా, వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్, యంత్రాల తయారీ కంపెనీలు నష్టపోతాయి. వీటిపై యూఎస్‌‌‌‌తో పోలిస్తే ఇండియా ఎక్కువ సుంకాలను విధిస్తోంది.  రెండు దేశాలు వేస్తున్న సుంకాల మధ్య  వ్యత్యాసం వేరువేరు రంగాల్లో వేరువేరుగా ఉంది. ప్రస్తుతం రసాయనాలు,  ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌ల దిగుమతులపై యూఎస్ కంటే ఇండియా వేస్తున్న టారిఫ్‌‌‌‌లు 8.6 శాతం ఎక్కువగా ఉన్నాయి. 

ప్లాస్టిక్‌‌‌‌పై 5.6 శాతం,  వస్త్రాలు,  దుస్తులపై 1.4 శాతం,  వజ్రాలు, బంగారం  ఆభరణాలపై 13.3 శాతం,  ఇనుము, ఉక్కు  బేస్ లోహాలపై 2.5 శాతం,  యంత్రాలు  కంప్యూటర్లపై 5.3 శాతం,  ఎలక్ట్రానిక్స్‌‌‌‌పై  7.2 శాతం,   ఆటోమొబైల్స్,   ఆటో భాగాలపై 23.1 శాతం  ఎక్కువ వేస్తోంది.  

రొయ్యలపై  భారీగానే

ట్రంప్ టారిఫ్‌‌‌‌లతో వ్యవసాయ రంగంలో  చేపలు, మాంసం,  ప్రాసెస్ చేసిన సీఫుడ్ ఎక్కువగా నష్టపోతాయి. యూఎస్‌‌‌‌కు  వీటి ఎగుమతులు కిందటేడాది  2.58 బిలియన్ డాలర్లను టచ్‌‌‌‌ చేశాయి. మరోవైపు యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తులపై   27.83 శాతం  ఎక్కువ టారిఫ్‌‌‌‌లను ఇండియా వేస్తోంది. అమెరికాకు   రొయ్యలు ఎగుమతి చేస్తున్న కంపెనీలు  సుంకాల కారణంగా  ఎక్కువగా నష్టపోతాయి.  

"మన ఎగుమతులపై అమెరికా ఇప్పటికే యాంటీ-డంపింగ్ వంటి  సుంకాలను వేస్తోంది. మరిన్ని సుంకాలు పడితే అక్కడి కంపెనీలతో పోటీపడలేము. ఇండియా రొయ్యల ఎగుమతుల్లో 40 శాతం అమెరికాకు వెళుతున్నాయి’’  అని కోల్‌‌‌‌కతాకు చెందిన సీఫుడ్ ఎగుమతిదారు  మెగా మోడా ఎండి యోగేష్ గుప్తా అన్నారు. యూఎస్‌‌‌‌కు సీఫుడ్ ఎక్కువగా ఎగుమతి చేస్తున్న ఈక్వెడార్,  ఇండోనేషియాపై కూడా  ఇలాంటి సుంకాలు విధిస్తే భారతీయ ఎగుమతిదారులకు కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర,  కోకో ఎగుమతులపై కూడా ఇరు దేశాల మధ్య   24.99 శాతం సుంకాల వ్యత్యాసం ఉంది. 

ట్రంప్ ప్రభుత్వం వీటిపై కూడా టారిఫ్‌‌‌‌లు పెంచొచ్చు.  కిందటేడాది వీటి ఎగుమతుల విలువ 1.03 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు  సుగంధ ద్రవ్యాల (1.91 బిలియన్ డాలర్ల ఎగుమతుల) మధ్య కూడా  5.72 శాతం సుంకాల వ్యత్యాసం ఉంది. పాల ఉత్పత్తులపై యూఎస్ కంటే 38.23 శాతం ఎక్కువ టారిఫ్‌‌‌‌ను ఇండియా వేస్తోంది. మన దేశం నుంచి సుమారు  181.49 మిలియన్ డాలర్ల విలువైన  పాల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

  నెయ్యి, వెన్న,  పాల పొడి వంటి పాల ఉత్పత్తులపై యూఎస్ ప్రభుత్వం టారిఫ్‌‌‌‌లు పెంచొచ్చు.  వంటనూనెల (199.75 మిలియన్ డాలర్ల ఎగుమతులు,  10.67 శాతం సుంకాల వ్యత్యాసం),  ఆల్కహాల్, వైన్,  స్పిరిట్స్ (19.2 మిలియన్ డాలర్ల ఎగుమతులు,  122.10 శాతం సుంకాల వ్యత్యాసం),   జంతు ఉత్పత్తులు (10.3 మిలియన్ డాలర్ల ఎగుమతులు,  27.75 శాతం వ్యత్యాసం) వంటి వివిధ ప్రొడక్ట్‌‌‌‌లపై కూడా టారిఫ్‌‌‌‌లు పెరిగే అవకాశం ఉంది.  ఫార్మా, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు అమెరికా సుంకాల ద్వారా ప్రభావితం కావచ్చు. 2024లో 12.72 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ప్రొడక్ట్‌‌‌‌లు యూఎస్‌‌‌‌కు ఎగుమతి అయ్యాయి. 

ఇండియా, యూఎస్ వేస్తున్న టారిఫ్‌‌‌‌ల మధ్య వ్యత్యాసం10.90 శాతంగా ఉంది.   వజ్రాలు, బంగారం,  వెండిపై 13.32 శాతం వరకు సుంకాలు పెరగొచ్చు.  ఎలక్ట్రికల్, టెలికాం,  ఎలక్ట్రానిక్స్‌‌‌‌పై కూడా  7.24 శాతం వరకు ట్రంపు ప్రభుత్వం సుంకాలు పెంచే ఛాన్స్‌‌‌‌ ఉంది.  యంత్రాలు, బాయిలర్లు, టర్బైన్లు,  కంప్యూటర్లపై  5.29 శాతం  వరకు సుంకాలు పెరగొచ్చు. టైర్లు,  బెల్టులతో సహా రబ్బరు ఉత్పత్తులపై 7.76 శాతం సుంకాలు పెరగొచ్చు. కాగా, 2023–24 లో అమెరికాతో  35.32 బిలియన్ డాలర్ల మిగులును ఇండియా సాధించింది.