1972లో స్వతంత్ర దేశం అయిన ఇన్నేళ్లలో బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటోంది. ఒకవైపు స్థిరంగా పెరుగుతున్న జీడీపీతోపాటు, రెండోవైపున జలవనరులు దారుణంగా దెబ్బతింటున్నాయి. రాజధాని ఢాకాకి సమీపంలో ప్రవహించే బూరిగంగ, తురంగ్, బాలు, షితలక్యా వంటి నదులన్నీ కలుషితమయ్యాయి. ఢాకా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘నదిని చంపుకోవటం అంటే మనమంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటమే’ అని తేల్చిచెప్పింది. నదుల కబ్జాదారులు, పొల్యూషన్ కారకులు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా బ్యాన్ చేయాలని ఎలక్షన్ కమిషన్ని ఆదేశించింది.
పొరుగు దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్ జీడీపీ కొన్నేళ్లుగా 6–7 శాతం మధ్య నిలకడగా ఉంటోంది. గతేడాదైతే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతంగా నమోదైంది. అభివృద్ధిలో బంగ్లాదేశ్ ఎన్నో దేశాలను దాటి ముందుకెళ్లింది. అయితే ఈ ప్రోగ్రెస్ దేశంలోని అన్ని ప్రాంతాలలో సమాన స్థాయిలో లేకపోవటం పెద్ద లోటు. ఈ అభివృద్ధి మాటున అక్కడి పర్యావరణం, జల వనరులు ఘోరంగా దెబ్బతింటున్నాయి. బంగ్లాదేశ్‌లో చిన్న నదులు, పెద్ద నదులు అన్నీ కలిపి మొత్తం సుమారు 230 ఉన్నాయి. జీవనోపాధి, రవాణా వంటి విషయాల్లో వీటిపై ఆధారపడ్డవారి సంఖ్య జనాభాలో 90శాతం వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ నదుల్లో చాలావరకు ఇప్పటికే బాగా కలుషితమయ్యాయి. ఆక్రమణలకు గురయ్యాయి. నదీ తలాలను (రివర్ బెడ్లను) ఇష్టమొచ్చినట్లు కబ్జా చేసినవాళ్లలో సంపన్నులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయని ఢాకా హైకోర్టు ఈ ఏడాది మేలో గుర్తించింది.
ఇదే గనుక జరిగితే బంగ్లాదేశ్‌లో నదుల ఆరోగ్యం మరింత క్షీణిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బూరిగంగా అనేది ఆ దేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. ఇది నాలుగేళ్ల క్రితమే తీవ్ర కాలుష్యంలో చిక్కుకున్నట్లు, ఆక్రమణ పాలైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆ నదిలోకి కలుషిత జలాలు లోతుగా పేరుకుపోవడంతో నల్లటి జెల్ లాంటి లిక్విడ్‌లా మారాయి. దేశ రాజధాని ఢాకాలోని హజారీబాగ్ ఏరియాలో ఉన్న లెదర్ ప్రాసెసింగ్ యూనిట్లు విషపూరిత వ్యర్థాలను యధాతథంగా ఆ నదిలోకి డంప్ చేస్తున్నాయి. దీనివల్లే సిటీ పరిధిలోని బూరిగంగా అధ్వాన్నంగా తయారవుతోంది. సిటీ జనాలు కూడా వివిధ వ్యర్థాలను నదిలో పారబోస్తున్నారు.
ఢాకా సమీపంలోని తురంగ్, బాలు, షితలక్యా వంటి నదులదీ ఇదే దుస్థితి. నగరంలోని మొత్తం నాలుగు నదుల్లోకి రోజూ 1.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల వేస్ట్ వాటర్ చేరుతున్నట్లు వరల్డ్ బ్యాంక్ స్టడీ తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని 7000 ఇండస్ట్రియల్ యూనిట్ల నుంచి కలుషితమైన నీరు కలుస్తోందని గుర్తించింది. ఇతర మార్గాల నుంచి మరో 0.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల పొల్యూటెడ్ వాటర్ నదుల్లోకి ప్రవహిస్తున్నట్లు తెలిపింది. బంగ్లా నదులను రక్షించుకోవలసిన అవసరాన్ని సర్కారుకు గట్టిగా గుర్తు చేయాలంటూ పర్యావరణవేత్తలు ఢాకా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటికి ప్రధాని షేక్ హసీనా సానుకూలంగా స్పందించి తగు ఆదేశాలిచ్చారు ప్రజలు చెత్తాచెదారాలను నదుల్లో వేయటం ఆపాలని, ప్రతి ఇండస్ట్రియల్ యూనిట్‌లోనూ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలని, తద్వారా నదులు పొల్యూట్ కాకుండా చూడొచ్చని చెప్పారు. బంగ్లాదేశ్‌లో నగరాలు, పట్టణాలు బాగా డెవలప్ అవుతున్నందున పల్లె ప్రజలు పెద్దఎత్తున వలస వస్తున్నారు. వలసవాసులకు ఇళ్లు, ఇతర సదుపాయాల అవసరం ఏర్పడుతోంది. అర్బన్ ఏరియాల్లో పాపులేషన్ వృద్ధి చెందుతుండటంతో రివర్ బెడ్ల ఆక్రమణలతోపాటు ఇళ్ల నుంచి వెలువడే చెత్త కూడా కుప్పలు తెప్పలుగా పెరుగుతోంది.
కబ్జాలపై ఢాకా హైకోర్టు హెచ్చరించడం, ప్రధాని హసీనా తీవ్రంగా పరిగణించడం వంటివన్నీ అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చాయి. బంగ్లాదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్లు ఢాకా పరిసర ప్రాంతాల్లోని నదుల ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా దాదాపు 4,000 అక్రమ కట్టడాలను కూల్చేశారు. తద్వారా 77 హెక్టార్ల ల్యాండ్‌ను ప్రభుత్వం తిరిగి అధీనంలోకి తీసుకుంది. దేశంలోని అన్ని నదులనూ సంరక్షించాల్సిన బాధ్యతకు సంబంధించి హైకోర్టు డివిజన్ జాతీయ నదుల పరిరక్షణ కమిషన్‌కి చట్టబద్ధమైన హక్కులు కల్పించింది.
కబ్జాకోరులపై కఠిన ఆంక్షలు
ఇటీవలే ఒక కేసులో తీర్పును వెలువరించే సందర్భంలో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. నదిని చంపుకోవటం అంటే మనమంతా కలసికట్టుగా ఆత్మహత్యకు పాల్పడటమేనని తేల్చిచెప్పింది. రివర్ బెడ్లను కబ్జా చేసినవారు, పొల్యూషన్‌కి కారణమైనవారు ఎవరైనాగానీ… అలాంటివారిని కౌన్సిళ్లు, సబ్–డిస్ట్రిక్ట్ కౌన్సిళ్లు, మునిసిపాలిటీలు, సిటీ కార్పొరేషన్, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ని ఆదేశించింది. ఇలాంటివాళ్లు బ్యాంకుల్లో లోన్లు కూడా పొందలేరని వార్నింగ్ ఇచ్చింది.
నదుల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హైకోర్టు డివిజన్ బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖకు సూచించింది. రెండు నెలలకోసారి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, మదర్సాలు సహా అన్ని పబ్లిక్, ప్రైవేట్ విద్యా సంస్థలలో గంటసేపు స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇలాంటి ప్రోగ్రామ్‌లు మరిన్ని చేపడితే తప్ప దేశంలోని నదులు కాలుష్యం, కబ్జాల బారి నుంచి బయటపడలేవని చెప్పింది. బంగ్లాదేశ్ తన గ్రోత్ రేటును భవిష్యత్‌లోనూ కొనసాగించాలంటే నదులను కాపాడుకోవటం తప్పనిసరి.
టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్లే..
బంగ్లాదేశ్‌లో నదుల పొల్యూషన్‌కి ముఖ్య కారణం టెక్స్టైల్ సెక్టార్. అక్కడ దుస్తుల పరిశ్రమ బాగా పురోభివృద్ధి చెందింది. బంగ్లాకి ఎగుమతుల ద్వారా వచ్చే మొత్తం రెవెన్యూలో 82 శాతం టెక్స్టైల్ ఇండస్ట్రీయే ఇస్తోంది. అక్కడ కలర్‌ఫుల్ డ్రెస్‌ల తయారీలో నేటికీ ప్రాచీన రంగుల పద్ధతులనే పాటిస్తున్నారు. వాటివల్లే నదుల్లోకి వేస్ట్ వాటర్ వస్తోందని ఓ స్టడీ గుర్తించింది. ఇప్పటికైనా మేల్కొనకపోలే మరో రెండేళ్లలో (2021 నాటికి)నదుల్లోకి చేరే కలుషిత జలాలు 349 మిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.