కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా! యాంటీబయాటిక్స్ అవశేషాలు మరీ ఎక్కువ..!

కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా! యాంటీబయాటిక్స్ అవశేషాలు మరీ ఎక్కువ..!
  • మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి.. 
  • టమాట, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్లు 
  • ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ఆకు కూరలు, కూరగాయల్లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు, యాంటీబయాటిక్స్​ఆనవాళ్లు ఉన్నట్టు ఇండియన్​ కౌన్సిల్​ ఫర్ ​మెడికల్ రీసెర్చ్​(ఐసీఎంఆర్) స్టడీలో తేలింది. మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈకొలి రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్​అవశేషాలూ ఉన్నట్టు వెల్లడైంది. 

మధ్యప్రదేశ్‌‌లోని ఐసీఎంఆర్​అనుబంధ సంస్థ నేషనల్​ ఇనిస్టిట్యూట్​ఫర్ ​రీసెర్చ్​ ఇన్​ ఎన్విరాన్మెంటల్​ హెల్త్, రాజస్థాన్‌‌లోని సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్​ఆఫ్ ​లైఫ్​ సైన్సెస్, హర్యానాలోని అగ్రికల్చర్​యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన స్టడీలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. టమాట, పచ్చి మిర్చి, క్యారెట్, దోస, ర్యాడిష్, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపోచలు, క్యాబేజీ ​వంటి వాటిల్లో యాంటీబయాటిక్స్, ఈకొలై బ్యాక్టీరియాల ఆనవాళ్లు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,780 శాంపిళ్లను సేకరించి.. వాటిలో ఉన్న బ్యాక్టీరియాల ప్రమాదస్థాయి, డ్రగ్​రెసిస్టెన్స్​, యాంటీబయాటిక్స్​అవశేషాలపై స్టడీ చేశారు. మన మూత్రనాళ వ్యవస్థను డ్యామేజ్​చేసే యూరోపాథోజెనిక్​ఈకొలై స్ట్రెయిన్స్​తో పాటు ఒంటిని సెప్టిక్​చేసే సెప్టిసీమియా ఈకొలై స్ట్రెయిన్స్​ఉన్నట్టు నిర్ధారించారు. 

ఈ యాంటీబయాటిక్స్‌‌కు రెసిస్టెన్స్​..

ఆయా బ్యాక్టీరియాలు ఉన్న కూరగాయలను తినడం వల్ల బ్యాక్టీరియాల డ్రగ్​రెసిస్టెన్స్​ప్రమాదకర స్థాయికి చేరుతున్నదని సైంటిస్టులు హెచ్చరించారు. ఈ కూరగాయల్లోని బ్యాక్టీరియా స్ట్రెయిన్లు వంద శాతం వరకు మల్టీ డ్రగ్​రెసిస్టెన్స్​(వివిధ యాంటీబయాటిక్స్‌‌కు నిరోధకత)ను సంతరించుకున్నాయని తేల్చారు. క్లోరాంఫెనికాల్, కోలిస్టిన్‌‌తో పాటు ఫ్రంట్​లైన్​యాంటీ బయాటిక్స్​అయిన నైట్రోఫ్యురాంటాయిన్, సల్ఫామీథాక్సజోల్, యాంపిసిలిన్, జెంటామైసిన్​తదితర యాంటీబయాటిక్స్‌‌కు రెసిస్టెన్స్‌‌ను సంతరించుకున్నాయని హెచ్చరించారు. మొత్తంగా కూరగాయల నుంచి సేకరించిన శాంపిళ్లలో 77 రకాల బ్యాక్టీరియా వర్గాలు ఉన్నట్టు నిర్ధారించారు. అత్యధికంగా క్యారెట్‌‌లోనే 25 శాతం వరకు బ్యాక్టీరియా రకాలు ఉన్నాయని తేల్చారు. ఆ తర్వాత క్యాబేజీలో 19.3 శాతం, మెంతిలో 18.5, టమాటలో 15.9, కొతిమీరలో 15.7, పాలకూరలో 15.2, పచ్చిమిర్చిలో 14.5, దోసలో 14.4, పుదీనాలో 12, ఉల్లిపోచల్లో 8.1 శాతం మేర ఆ బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్​ఉన్నాయని వెల్లడించారు.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. 

ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్లు ఉన్న కూరగాయలను తింటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ చికెన్​ వంటి మాంసాహారాల్లోనే వీటి ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించినా.. ఇప్పుడు శాకాహారాలైన  కూరగాయలనూ అవి రిజర్వాయర్లుగా చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఎక్కువగా మనుషులు విసర్జించే మలం ద్వారానే అవి కూరగాయల మొక్కల్లోకి చేరుతున్నాయని అంటున్నారు.  పెస్టిసైడ్స్‌‌ను ఎక్కువగా చల్లడం వల్ల కూడా యాంటీబయాటిక్స్​అవశేషాలు కూరగాయల్లోకి చేరుతున్న దాఖలాలున్నాయని చెబుతున్నారు.

మరోవైపు చిన్నపిల్లల్లో మెదడువాపుకు కారణమయ్యే నియోనేటల్​మెనింజైటిస్​ ఈకొలై స్ట్రెయిన్స్​కూడా పలు కూరగాయల్లో ఉన్నట్టు హెచ్చరించారు.  ఈ బ్యాక్టీరియాలు కూరగాయల ద్వారా ఎంతమేర యాంటీబయాటిక్స్​రెసిస్టెన్స్​ సంతరించుకుంటున్నాయన్న దానిపై   స్టడీ చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.