ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. బీసీసీఐ భారత క్రికెట్ జట్టును పాక్ కు పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు పాకిస్థాన్ మా దేశంలోకి భారత్ రావాల్సిందేనని గట్టిగా పట్టు పడుతుంది. ఈ విషయంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తమ దేశానికి భారత్ రావొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కనేరియా హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు పలుకుతున్నాడు. పాకిస్తాన్‌లో ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా అన్ని ఆటగాళ్లకు ముఖ్యంగా భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం చాలా ముఖ్యమని కనేరియా అభిప్రాయపడ్డారు. ఆటగాళ్ళ భద్రతకు ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇవ్వాలని ఆయన తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి పాకిస్తాన్‌కు మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. దేశంలో ప్రస్తుత వాతావరణం అన్ని జట్ల భద్రతకు గ్యారంటీ లేదని ఆయన అన్నారు. భద్రత తర్వాతే గౌరవం రెండవ ప్రాధాన్యతని..హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నీ జరపడం ఉత్తమం అని నేను భావిస్తున్నాని కనేరియా ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు.
ALSO READ | CPL 2024: కరేబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్
భారత్ పాకిస్థాన్ కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు జరుగుతాయి. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లు శ్రీలంక లేదా దుబాయ్‌లో జరుగుతాయి. 2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు.
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.
పాక్ వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేశారు. దీని ప్రకారం గ్రూప్ ఏ లో పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్,న్యూజిలాండ్.. గ్రూప్ బి లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆడతాయి.