Ranji Trophy 2025 Final: విదర్భ జోరు.. రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాదిన 21 ఏళ్ళ కుర్రాడు

Ranji Trophy 2025 Final: విదర్భ జోరు.. రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాదిన 21 ఏళ్ళ కుర్రాడు

21 ఏళ్ళ కుర్రాడు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పెద్దగా అనుభవం లేదు.. అసలే రంజీ ట్రోఫీ ఫైనల్.. ఇవన్నీ తనకు అడ్డుకాదని నిరరూపిస్తూ 21 ఏళ్ళ  డానిష్ మాలేవర్ సెంచరీతో సత్తా చాటాడు. కేరళతో బుధవారం (ఫిబ్రవరి 26) ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు ఆటలో భాగంగా తన సెంచరీతో విదర్భ జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిని తట్టుకుంటూ మాలేవర్ చేసిన సెంచరీపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ యువ క్రికెటర్.. ప్రస్తుతం 132 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. 

ఈ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన విదర్భకు మంచి ఆరంభం దక్కలేదు. 2కేరళ పేసర్ల ధాటికి 24 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నిదీష్ విజృంభణతో  పార్థ్ రేఖడే(0), దర్శన్ నల్కండే(1) సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. ఈ దశలో సీనియర్ ప్లేయర్.. అనుభవజ్ఞుడు కరుణ్ నాయర్ తో డానిష్ మాలేవర్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆచితూచి ఆడుతూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో వికెట్ కు ఈ జోడీ 215 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పటిష్ట స్థితికి చేర్చారు.

జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయమన్న దశలో దురదృష్టవశాత్తు కరుణ్ నాయర్ 86 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ప్రస్తుతం విదర్భ తొలి రోజు 85 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. క్రీజ్ లో డానిష్ మాలేవర్ (138), యష్ ఠాకూర్ (2) ఉన్నారు. కేరళ బౌలర్లలో నిదీష్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈడెన్ ఆపిల్ టామ్ కు ఒక వికెట్ లభించింది.