ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

 

  • 36 నెలలుగా అద్దెకట్టని ప్రభుత్వం
  • ఆఫీసుకు తాళం వేసిన ఓనర్
  • బయటనే వెయిట్ చేసిన ఆఫీసర్లు

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 36 నెలల అద్దె పెండింగ్ లో ఉండడంతో విసిగివేసారిన ఓనర్.. ఎంపీడీవో ఆఫీసుకు తాళం వేశారు. గురువారం మండల సభ నిర్వహించుకుందామని వచ్చిన ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు కంగు తిన్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంపీడీవో ఆఫీసు అద్దె భవనంలో నడుస్తోంది. గత 36 నెలలుగా ప్రభుత్వం అద్దె కట్టకపోవడంతో.. సదరు ఓనర్ తాళం వేశాడు. దీంతో మండల సభకు వచ్చిన వారంతా బయటే నిల్చున్నారు. ఓనర్ ను బతిలాడి, ఆఖరికి తాళం తెరిపించారు. ఎంపీపీ ఓలాద్రి ఉమ ఆధ్వర్యంలో మండల సభ నిర్వహించారు.

జీపీలకు నిధులివ్వడంలో నిర్లక్ష్యమెందుకు?

ఎల్కతుర్తి: గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎల్కతుర్తి మండల సభలో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. తిమ్మాపూర్–సీతంపేట మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా ఆఫీసర్లు పనులు ప్రారంభించడం లేదన్నారు. రెండు, మూడు నెలలుగా జీపీలకు ఫండ్స్ రావడం లేదని, పంచాయతీలను ఎలా నడపాలని సర్పంచులు నిలదీశారు. ఓవైపు కరెంట్​ బిల్లులు కట్టకుంటే కనెక్షన్లు నిలిపేస్తామంటూ కరెంట్ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారని, నిధులు ఇవ్వకుంటే ఎలా కట్టాలని ప్రశ్నించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయని, వాటిని అరికట్టాలని కోరారు. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు.

ఎక్కడ పడితే అక్కడే చెత్త
పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
బల్దియా ఆఫీసర్లపై మేయర్ గరం

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: సిటీలో శానిటేషన్ అధ్వానంగా ఉందని, ఎక్కడ పడితే అక్కడే చెత్త కనిపిస్తోందని మేయర్ గుండు సుధారాణి మండిపడ్డారు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. గురువారం తన ఛాంబర్ లో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఆఫీసర్లు క్షేత్రస్థాయి పర్యటించడం లేదని, డ్యూటీలో నిర్లక్ష్యం చేస్తున్నారని గరం అయ్యారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, మార్కెట్లలోని చెత్తను బయో గ్యాస్ ప్లాంట్లకు తరలించాలన్నారు. సిటీని గార్బేజీ ఫ్రీ సిటీగా మార్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ విభాగాలను మేయర్ ఆకస్మికంగా తరలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్ అనిసూర్, రషీద్, ఎంహెచ్​వో డాక్టర్ రాజేశ్ తదితరులున్నారు.

రైతు సమస్యలపై పోరాడాలి

ములుగు, వెలుగు: ఢిల్లీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని రైతు సమస్యలపై పోరాటం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. గురువారం ములుగు జిల్లాకేంద్రంలో ఏఐకేఎస్ జిల్లా మొదటి మహాసభలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధర కల్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఏటా మిల్లర్లు కోతలు పెడుతూ రైతులను ఇబ్బందిపెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కౌలు రైతులను అన్నదాతలుగా గుర్తించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో చిట్టెం ఆదినారాయణ, తుమ్మల వెంకట్ రెడ్డి, గుండు రామస్వామి తదితరులున్నారు.

బతుకమ్మ విగ్రహం మాయం!

హసన్ పర్తి, వెలుగు: గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహం రాత్రికిరాత్రే మాయమైంది. స్థల వివాదం కారణంగా గుర్తు తెలియని దుండగులు దీనిని తొలగించినట్లు తెలుస్తోంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరిలో ఓ భూయజమాని బతుకమ్మ విగ్రహం, మైదానం కోసం 20 గుంటల భూమిని దానం చేశాడు. అప్పటినుంచి గ్రామస్తులు అక్కడే బతుకమ్మ ఆడుతున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. పునాదుల నుంచి ధ్వంసం చేసి శిథిలాలు కూడా కనబడకుండా చేశారు. దీంతో గ్రామస్తులంతా ఆందోళన చెందారు. విషయాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ దృష్టికి తీసుకెళ్లగా.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్​ తీసుకోకపోవడంతో గ్రామస్తులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని 
ఆరోపిస్తున్నారు.

చెట్టును ఢీకొన్న బైక్.. కలెక్టర్ డ్రైవర్ మృతి

జనగామ అర్బన్, వెలుగు: డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న కలెక్టర్ డ్రైవర్.. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషాద సంఘటన జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన దొమ్మాట ఉపేందర్(32) కొన్నేండ్లుగా జనగామ కలెక్టరేట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గతంలో కలెక్టర్ కారు నడపగా.. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ వాహనం నడుపుతున్నాడు. బుధవారం డ్యూటీ   ముగించుకుని .. రాత్రి 11గంటలకు బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఓబుల్ కేశ్వాపూర్ సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించగా..  అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఉపేందర్ మృతి పట్ల కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హామీద్, కలెక్టరేట్ సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతి చెప్పారు.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు

వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ కోట చుట్టుపక్కల వెలసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గోపీ చెప్పారు. గురువారం తన ఛాంబర్ లో సంబంధిత ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చారిత్రక కట్టడమైన ఖిలా వరంగల్ ప్రాంతంలో 100 మీటర్ల వరకు నిర్మాణాలు నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు చారిత్రక కట్టడాల పరిరక్షణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, ఆర్డీవో మహేందర్ జీ, కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత ఎస్ కుమార్  తదితరులున్నారు.

ఫుల్లుగా తాగి వ్యక్తి మృతి
పర్మిట్ రూంలో సంఘటన

బచ్చన్నపేట, వెలుగు: లిక్కర్​ ఫుల్లుగా తాగి వ్యక్తి మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి(39) వ్యవసాయ పనులు చేసేవాడు. కొద్దిరోజులుగా పనులు మానేసి, జులాయిగా తిరుగుతూ.. మద్యానికి బానిసయ్యాడు. గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు తన మిత్రుడితో కలిసి మైత్రి వైన్స్ లోని పర్మిట్ రూంలో అతిగా లిక్కర్ ​తాగాడు. కొద్దిసేపటికి కుప్పకూలాడు. చుట్టుపక్కల వాళ్లు లేపి చూడగా చనిపోయి కనిపించాడు.

పోడు భూములకు పట్టాలివ్వాలి
కేసులు వెనక్కి తీసుకోవాలి

శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామ శివారులోని పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని రైతులు, దళిత సంఘాల లీడర్లు డిమాండ్ చేశారు. గురువారం శాయంపేట మండలకేంద్రం నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పోడు పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలన్నారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకొని పోడు రైతుల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.

బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయండి

కాజీపేట, వెలుగు: కాజీపేట ఆర్వోబీకి సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి పనుల్ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బల్దియా కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పనులను పరిశీలించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సర్కారు రూ.78కోట్లు వెచ్చించిందన్నారు. ఫాతిమా సర్కిల్ లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల కోసం రూ.55లక్షలు మంజూరు చేశామన్నారు. లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు నర్సింగ్ రావు, మానస రాంప్రసాద్ తదితరులున్నారు.