విండీస్‌కు బిగ్ షాక్: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జూనియర్ లారా 

విండీస్‌కు బిగ్ షాక్: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జూనియర్ లారా 

వెస్టిండీస్ క్రికెట్ రోజు రోజుకి పతన స్థాయికి చేరుకుంటుంది. వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించకపోవడం, బోర్డు మధ్య గొడవలు, ఆటగాళ్లు జాతీయ జట్టుకు కన్నా అంతర్జాతీయ లీగ్ లకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి విండీస్ జట్టును కుదిపేశాయి. తాజాగా ఆ జట్టుకు బిగ్ షాక్ ఇస్తూ స్టార్ బ్యాటర్ డారెన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వైన్ బ్రావోకు ఇతడు తమ్ముడు. 

బ్రావో బ్యాటింగ్ శైలి అచ్చం విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను పోలి ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తుంటే లారా బ్యాటింగ్ లా అనిపిస్తుంది. 2009 లో భారత్ పై విండీస్ వన్డే జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న డారెన్.. అతి తక్కువ కాలంలోనే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తన పదేళ్ల కెరీర్ లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన బ్రావో.. టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరొందాడు. 2010 లో శ్రీలంకపై తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. 2022 లో భారత్ పైనే చివరి వన్డే ఆడిన బ్రావో.. పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో అంతర్జాతీయ లీగ్ పై దృష్టి పెట్టాడు. 

కెరీర్ విషయానికి వస్తే 56 టెస్టుల్లో 3538 రన్స్, 122 వన్డేల్లో 3109 రన్స్ చేసాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 218 కాగా..వన్డేల్లో 124. 26 టీ 20 ల్లో 405 పరుగులు చేసాడు. టెస్టుల్లో 8 సెంచరీలు నమోదు చేసిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వన్డేల్లో 4 సెంచరీలు చేసాడు. ఐపీఎల్ లో 2012 లో డెక్కన్ చార్జర్స్  తరపున ఆడిన ఈ బ్యాటింగ్ వీరుడు.. ప్రస్తుతం  విండీస్ ప్రీమియర్ లీగ్ లో ట్రినిడాడ్ అండ్ టొబాకో జట్టు తరపున ఆడుతున్నాడు.